
మార్పుతోనే ప్రగతి
● తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ టాక్ షో
● ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
‘విద్య, వైద్యం, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలి.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించాలి.. పారిశ్రామిక రంగాన్ని విస్తరించి యువత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి.. అన్ని రంగాల్లో సమూల మార్పు వచ్చినప్పుడే దేశ ప్రగతి సాధ్యం’ అని తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వందేళ్ల భారత్ ఎలా ఉండాలి అనే అంశంపై గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కళాశాలలో చర్చ వేదిక నిర్వహించారు. విద్యార్థులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
– తాండూరు/తాండూరు టౌన్
దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ లంచగొండితనం అదే స్థాయిలో ఉంది. దాన్ని పూర్తిగా నిర్మూలించాలి. గ్రామీణ ప్రాంతాలకు విద్య, వైద్యం చేరాలి.
– ఆకాష్ రాథోడ్, బీఏ ద్వితీయ సంవత్సరం
స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తయినా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ విద్య అందడం లేదు. సరైన వైద్య సేవలు లేవు. విద్య, వైద్య రంగాలను మెరుగు పర్చాలి.
– అబ్దుల్, డిగ్రీ విద్యార్థి
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి. రసాయన ఎరువులను పూర్తిగా తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించాలి. అందరికీ సమాన విద్య దిశగా చర్యలు చేపట్టాలి.
– మౌనిక, బీఎస్సీ ఫస్ట్ ఇయర్
స్థానికంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించాలంటే పారిశ్రామిక ప్రగతి ఎంతో అవసరం. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలి.
– కావేరి, బీకాం ఫస్ట్ ఇయర్
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ ఎంతో కీలకం. మారుమూల ప్రాంతాలకు సరైన రోడ్లు, బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదు. ప్రజలను సోమరులుగా మార్చే ఉచిత పథకాలను రద్దు చేయాలి. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
– నాగ వైష్ణవి, బీఎస్సీ
దేశంలో వాతావరణ కాలుష్యం రోజు రోజుకూ పెరిగి పోతోంది. పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయాలి. వాహనాల్లో పెట్రోల్, డిజిల్ స్థానంలో బయో డిజిల్‌ను వినియోగించాలి. వృక్ష సంపదను పెంచాలి.
– హీనా, కంప్యూటర్ సైన్స్
ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించేలా ప్రత్యేక చొరవ చూపాలి. ప్రతి జిల్లాకు ఒక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి. మేకిన్ ఇండియాలో భాగంగా విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి.
– సామియా, బీఏ సెకండ్ ఇయర్
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాలను ప్రోత్సహించాలి. ఆ దిశగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఇటీవల కాలంలో రసాయన ఎరువుల వాడకం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
– లక్ష్మి, కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ యువతం ఎక్కువగా ఉంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి. అప్పుడే ఆర్థిక, సామాజిక పురోగతి సాధిస్తాం.
– రాథోడ్ దేవ్‌జీ, కంప్యూటర్ సైన్స్, థర్డియర్
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం అందాలి. దేశంలో ఆర్థిక అసమానతల వల్ల సమాన హక్కులు సాధ్యం కావడం లేదు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
– అయేషాబేగం, బీఎస్పీ
వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలంటూ విద్యార్థులు ఆలోచించడం అభినందనీయం. ఉచిత పథకాల వల్ల జనాలు సోమరులు అవుతున్నారన్న మాటలు ఆలోచింప జేస్తున్నాయి.
– చంద్రకళ, ప్రిన్సిపాల్
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. పాలకులు తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదం చేశాయి. పీవీ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయి. జవహర్‌లాల్‌నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు అభివృద్ధే లక్ష్యంగా సాగారు. 2047 నాటికి దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది.
– ఉత్తమ్‌చంద్, కరస్పాడెంట్, పీపుల్స్ కళాశాల
దేశంలో పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండరాదు. పేదరికాన్ని నిర్మూలించాలంటే విద్య, వైద్య రంగాలు మెరుగు పడాలి.
– శ్రీలత, బీకాం ఫస్ట్ ఇయర్