
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
● బోరుమోటారు సర్వీస్ వైర్ సరిచేసే క్రమంలో షాక్ ● ముద్దాయిపేటలో విషాదం
యాలాల: వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు మృత్యువాత పడ్డాడు. యాలాల మండలం ముద్దాయిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాలేపల్లి రమేశ్‌గౌడ్(38) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరి సాగుకు కరిగేట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో బోరుకు కరెంటు సరఫరా చేసే సర్వీస్ వైర్ తెగిపడి ఉండటాన్ని గమనించాడు. దీన్ని అతికించే క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా రమేశ్ అప్పటికే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య గౌరమ్మ, కొడుకు ప్రదీప్, కూతురు శ్రీజ ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే రమేశ్ మృతిని గ్రామస్తులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలు పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రమేశ్ అకాల మరణంతో ముద్దాయిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.