సిద్ధమవుతున్న యూనిఫాం
స్కూళ్లు తెరిచే నాటికి
అందజేస్తాం
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన దుస్తులను కుట్టాల్సిన బాధ్యత మహిళ సంఘాలకు అప్పజెప్పాం. అయితే ఇప్పటి వరకు 80శాతం పూర్తయ్యాయి. స్కూళ్లు తెరిచే నాటికి యూనిఫాంలను సకాలంలో పూర్తిచేసి ఎంఈఓకు పంపిస్తాం.
– హరినారాయణ, ఇన్‌ఛార్జి ఏపీఎం
దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రారంభంలోనే నూతన యూనిఫాం అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. యూనిఫాం కుట్టు పనులను ఈ ఏడాది నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం సమస్య తీవ్రంగా ఉండేది. కాంట్రాక్టర్లకు కుట్టుపని బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా సరిపడా యూనిఫాంలు అందించేవారుకాదు. అంతేకాకుండా కొలతల్లో హెచ్చు తగ్గులు ఉండడంతో వాటి వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్త్రాలను కొనుగోలు చేసి యూనిఫాం కుట్టే పనులను మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తున్నారు. ఫిబ్రవరిలోనే వీఓఏలు, ప్రధానోపాధ్యాయుల చొరవతో విద్యార్థుల కొలతలు సేకరించారు. వాటిని పూర్తి చేయించే పనిలో సంబంధిత అధికారులు బాధ్యతలు తీసుకున్నారు.
మొత్తం 3,250 మంది విద్యార్థులకు..
దౌల్తాబాద్ మండలంలో ఎనిమిది ఉన్నత, ఏడు ప్రాథమికోన్నత, 24 ప్రాథమిక పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 3,250 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మండలంలో నందారం, ఈర్లపల్లి, దౌల్తాబాద్, కౌడీడ్ గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు యూనిఫాంలు కుడుతున్నారు. ఇప్పటి వరకు 80శాతం పూర్తయినట్లు తెలిపారు. ఇంకా చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలాయని వివరిస్తున్నారు. కుట్టు పనులను ఐకేపీ అధికారులు, ఎంఈఓ వెంకట్‌స్వామి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మహిళా సంఘాలకు
కుట్టుపని బాధ్యతల అప్పగింత
పాఠశాలల ప్రారంభంలోనే
విద్యార్థులకు అందజేసేలా ప్రణాళిక


