విద్యార్థుల సంఖ్య పెంచండి
బంట్వారం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం కోట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో బడిబాట కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించే ఉపాధ్యాయులు విద్యార్థుల వివరాలు సేకరించాలన్నారు. వీరందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. డిజిటల్ బోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, భోజన వసతిపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇక నుంచి వారానికి ఒక్కసారి తల్లిదండ్రులతో సమావేశం ఉంటుందన్నారు. పాఠశాలల అభివృద్ధిలో స్థానికులు, తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి పేర్కొన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను డీఈఓ సత్కరించారు. అనంతరం కరీంపూర్ గేటు సమీపంలో నిర్మిస్తున్న కేజీబీవీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రప్ప, పాఠశాల సిబ్బంది, కేజీబీవీ ఎస్‌ఓ పల్లవి, సీఆర్‌పీ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
డీఈఓ రేణుకాదేవి


