భూ భారతితో రైతులకు మేలు
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
ధారూరు: గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని.. భూ భారతి చట్టం అందుబాటులోకి వస్తే ఆ సమస్య ఉండదని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. కొత్త చట్టం ద్వారా గ్రామాల్లోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు చక్కటి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. గురువారం మండలంలోని నర్సాపూర్, గడ్డమీది గంగారం గ్రామాల్లో భూ భారతి రెవన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి పరంగా ఏదైనా తప్పు జరిగితే ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆర్డీఓ స్థాయిలో కూడా తప్పు జరిగితే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి సవరించుకోవచ్చని వివరించారు. గతంలో మిస్సింగ్ సర్వే నంబర్ తెలుసుకునేందకు మీ సేవ కేంద్రంలో రూ.1,300 చెల్లించాల్సి వచ్చేదని, భూ భారతిలో ఫిర్యాదు చేస్తే సరిచేసే వీలుందని తెలిపారు. అనంతరం రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రెండు గ్రామాల నుంచి భూ సమస్యల పరిష్కారం కోసం 36 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు శ్రీనివాస్, సాజిదాబేగం, డీటీ విజయేందర్, ఆర్‌ఐ స్వప్న, రెవన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


