స్నేహితుడిని నమ్మించి..
షాద్‌నగర్ రూరల్: స్నేహితుడిని నమ్మించి, నగదు దోచుకెళ్లడంతో పాటు ఎవరికై నా చెబితే చంపుతామ ని బెదిరించిన నిందితులను పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. నగరంలోని యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న నాగేశ్వరం శ్రీధర్ సినీ డైరెక్టర్. శివరాంపల్లికి చెందిన రొయ్యల మల్లేశ్‌తో ఇతనికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ పరిధి విఠ్యాల వద్ద ఓ వెంచర్‌లో ప్లాటు అమ్మకానికి ఉందని, తక్కువ ధరకే ఇప్పిస్తానని శ్రీధర్ మల్లేశ్‌కు చెప్పాడు. అనంతరం షాద్‌నగర్‌కు చెందిన చింతోజు శ్రీధర్‌ను ఫోన్‌ద్వారా పరిచయం చేశాడు. స్నేహితుడి మాటలు నమ్మిన మల్లేశ్ ప్లాటును చూసేందుకు శివరాంపల్లికి చెందిన తన స్నేహితులు రవి, రాజుతో కలిసి గత నెల 27న కారులో షాద్‌నగర్‌కు వచ్చారు. ప్లాటుకు బయానా ఇచ్చేందుకు మల్లేశ్ రూ.5.60 లక్షలు తీసుకువచ్చాడు. నాగేశ్వరం శ్రీధర్ చెప్పినట్లుగా ప్లాటును చూపించేందుకు చింతోజు శ్రీధర్ స్నేహితులు శ్రీనాథ్ శ్రీకాంత్.. మల్లేశ్ పాటు అతని స్నేహితులను వెంచర్‌కు తీసుకెళ్లారు.
చంపుతామని బెదిరించి..
మల్లేశ్ కారులో డబ్బులు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నాగేశ్వరం శ్రీధర్ ఎలాగైనా కాజేయాలని చింతోజు శ్రీధర్‌కు చెప్పాడు. వెంచర్ వద్ద ఎవరూ లేకపోవడంతో మల్లేశ్ కారుకు రాళ్లను అడ్డుగాపెట్టి అద్దాలు పగులగొట్టారు. మల్లేశ్, రవి, రాజుపై రాళ్లతో దాడిచేసి ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. కారులో ఉన్న రూ.5.60 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై గత నెల 29న కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించి ఈనెల 1న చింతోజు శ్రీధర్, నాగేశ్వరం శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం ఒప్పుకొన్నారు. నిందితుల నుంచి రూ.2.70 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన డీఐ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఐ శివారెడ్డి, సిబ్బంది మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, రఫీని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. వీరికి తగిన రివార్డులు అందజేస్తామని సీఐ తెలిపారు.
రూ.5.60 లక్షలు దోపిడీ
ఇద్దరు నిందితులకు రిమాండ్
వివరాలను వెల్లడించిన పట్టణ సీఐ విజయ్‌కుమార్


