కోనేరులో పూడికతీత
కుల్కచర్ల: మండలంలోని పాంబండ రామలింగేశ్వర దేవస్థానంలో ఉన్న సిద్ధి రామయ్య ఆలయం ఎదుట ఉన్న కోనేరులో గురువారం పూడికతీత పనులు ప్రారంభించారు. కొన్నేళ్లుగా మట్టితో నిండిపోవడంతో పాలకమండలి సభ్యులు కోనేరు పూడికతీతకు నిర్ణయించి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పాంబండ దేవస్థానం ఆలయ ప్రతిష్టను పెంపొందించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీటీసీ డీఎస్పీగా శ్రీనివాసులు
అనంతగిరి: వికారాబాద్‌లోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం డీఎస్పీగా శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం నిర్వహించిన బదిలీలో భాగంగా బాలనగర్ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం డీటీసీ ప్రిన్సిపల్ మురళీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.


