ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

May 1 2025 7:32 AM | Updated on May 1 2025 7:32 AM

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

● కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు తప్పనిసరి ● కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

అనంతగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి వరి కొనుగోలు, సన్న బియ్యం పంపిణీ అంశాలపై జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 128 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు కావలసిన తాడిపత్రిలు, సంచులు, తేమ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వర్తించని వారిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. రైస్‌ మిల్లర్ల వద్ద బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఎలాంటి లోపభూయిష్టం లేకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేయాలని చెప్పారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్‌, సుధీర్‌, ట్రెయినీ కలెక్టర్‌ హర్ష చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్‌, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబు మోజస్‌, వ్యవసాయ శాఖ ఏడీఏ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు అధికారుల ఉద్యోగ విరమణ

నిజాయతీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన ప్రభుత్వ ఉద్యోగులకు జీవితంలో ఎంతో సంతృప్తిని ఇస్తుందని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. బుధవారం ఉద్యోగవిరమణ పొందుతున్న షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, యువజన క్రీడల అధికారి హనుమంతరావు, యలాల తహసీల్దార్‌ అంజయ్యను కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగం ఆత్మీయ సన్మానం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రజా సేవ చేసే అదృష్టం వస్తుందని.. నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు అందుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో మీసేవలను తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్‌, సుధీర్‌, ట్రెయినీ కలెక్టర్‌ హర్ష చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబు మోజెస్‌, డీబీసీడబ్ల్యూఓ ఉపేందర్‌, డీఎండబ్ల్యూఓ కమలాకర్‌ రెడ్డి, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement