● అలంకారప్రాయంగా సిగ్నల్ వ్యవస్థ
తాండూరు: పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2017లో పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల పాటు అవి బాగానే పని చేశాయి. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడంతో 2021 నుంచి పని చేయడం లేదు. అప్పటి నుంచి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. రోడ్ల పక్క వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా మున్సిపాలిటీల ప్రజలు కోరుతున్నారు.


