శిలాఫలకంలో పేర్లు లేవని..
యాలాల: మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్‌లో బుధవారం హెచ్‌డీసీసీబీ శాఖ బ్యాంకు ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ పేర్ల రగడ నెలకొంది. బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తన పేరు లేకపోవడంపై యాలాల సొసైటీ వైస్ చైర్మన్ వడ్డే రాములు మండిపడ్డారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు వైస్ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు కావడంతో ప్రారంభోత్సవంలో గొడవ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు, బ్యాంకు అధికారులు వైస్ చైర్మన్‌కు నచ్చజెప్పారు. శిలాఫలకంపై తాత్కలికంగా పేరు ఏర్పాటుకు వైస్ చైర్మన్‌ను ఒప్పించారు. ఆయన పేరుపై కొత్త స్టిక్కర్ కోసం బ్యాంకు సిబ్బందిని తాండూరుకు పంపించారు. అప్పటికే ఎమ్మెల్యే లక్ష్మీనారాయణపూర్ రావడానికి సిద్ధమయ్యారు. స్థానిక నాయకులు ప్రొటోకాల్ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన 20 నిమిషాల తరువాత కార్యక్రమానికి హాజరయ్యారు.
బ్యాంకు పరిధి అగ్గనూరు గ్రామానిది..
శిలాఫలకంలో తన పేరు లేదని వైస్ చైర్మన్ ఆగ్రహం చేసిన సమయంలో అగ్గనూరు గ్రామానికి చెందిన కొందరూ నాయకులు అక్కడికి చేరుకున్నారు. డీసీసీబీ బ్యాంకు అగ్గనూరు పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారని, బ్యాంకు బోర్డుపై తమ గ్రామం పేరు ఉండాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎమ్మెల్యే గ్రామస్తులకు నచ్చజెప్పారు. ఆర్‌బీఐ నుంచి వచ్చిన అనుమతి పత్రాల్లో బ్యాంకు చిరునామాలో లక్ష్మీనారాయణపూర్ ఉందని, అయినప్పటికీ బోర్డుపై అగ్గనూరు పేరు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కాగా ప్రొటోకాల్, ఊరిపేరు అంశం బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చర్చనీయాంశంగా మారింది.
బ్యాంకు ప్రారంభ కార్యక్రమంలో
నాయకుల ఆందోళన


