రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్ పోరాటం
పరిగి: రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తోందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 2, 3, 11 వార్డుల్లో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వకున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం కుట్ర పన్ని కావాలనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపుతోందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు నిధులు అందజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపించడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని దేశఽంలోని ప్రజలను విడదీసి పాలిస్తోందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలోని బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ ఊరుకోబోదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగిలో జై సంవిధాన్ యాత్ర


