షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు
బొంరాస్‌పేట: వేసవితాపానికి ఉపశమనం కోసం ఇంట్లో పెట్టుకున్న కూలర్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల పరిధిలోని తుంకిమెట్లలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సఫియాబేగం ఇంట్లో మధ్యాహ్నం కూలర్ ఆన్‌చేసుకొని ఉండగా కొద్దిసేపటికి అందులోంచి మంటలు వ్యాప్తించాయి. చూస్తుండగానే వేగంగా వ్యాప్తి చెందడంతో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. కుటుంబ సభ్యులు అరవడంతో కాలనీవాసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక వాహనంతో సిబ్బంది మంటలు పూర్తిగా చల్లార్చారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వస్తువులు కాలిపోయాయని బాధితురాలు వాపోయింది. రూ.6లక్షల మేర నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. బాధితురాలిని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అనిఫ్ పరామర్శించారు.


