వంట.. మంట
● ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు ● జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 2,08,553 ● వేసవిలో నెలకు ఒకటి చొప్పున వినియోగిస్తున్న జనం ● ఏడాదికి ఒక్కో కుటుంబంపై రూ.600 వరకు అదనపు భారం
వికారాబాద్: వంట గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలొ చ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.50 చొప్పున పెంచి పేదల నడ్డి విరిచింది. కేంద్రం తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.855 ఉండగా, తాజా పెంపుతో రూ.905కు చేరింది.దీంతో జిల్లా వాసులపై నె లకు సగటున రూ.45.78 లక్షల భారం పడనుంది.
ప్రభుత్వంపై అదనపు భారం
జిల్లాలో మొత్తం 2,08,553 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డులు ఉన్న 1,16,990 మందికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తోంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.400ల వరకు భరిస్తూ వచ్చిన సర్కారు ఇక నుంచి రూ.450 భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.58,49,500 గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో మహాలక్ష్మి పథకం వర్తించని గ్యాస్ కనెక్షన్లు 91,563 ఉండగా వారికి నెలనెలా రూ.45,78,150 అదనపు భారం పడనుంది. జిల్లాలో 2,08,553 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో జనరల్ కనెక్షన్లు(డబుల్ సిలిండర్లు)19,358, సింగల్ సిలిండర్ కనెక్షన్లు 69,902 ఉన్నాయి. కమర్షియల్ కనెక్షన్లు 3209 ఉండగా దీపం పథకం కింద 35,193 కనెక్షన్లు, ఉజ్వల్ పథకం 38,753 కనెక్షన్లు, సీఎస్‌ఆర్ కింద 21260 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.


