ఎన్నికలకు పటిష్ట భద్రత అవసరం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పటిష్ట భద్రత అవసరం

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

తిరుపతి అర్బన్‌ : శ్రీకాళహస్తి మున్సిపల్‌, సర్పంచ్‌, వార్డు మెంబర్‌ ఎన్నికలకు పటిష్ట భద్రత అవసరమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కోరారు. బుధవారం ఈ మేరకు కలెక్టరేట్‌లో జేసీ గోవిందరావుకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ప్రశాంతవాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్ల పర్వంలో టీడీపీ మూకలు చేసిన దాడులు, గూండాగిరీ, అరాచకాలను దృష్టిలో ఉంచుకుని గురువారం నిర్వహించనున్న ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు కల్పింఆచలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రతి ఓటరు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో పోలీస్‌ అధికారులకు సైతం వినతిపత్రం అందించారు. శ్రీకాళహస్తిలో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసులు సైతం పక్షపాతం లేకుండా పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.

అభ్యర్థులు, ఏజెంట్ల రక్షణకు వినతి

తిరుపతి మంగళం : శ్రీకాళహస్తి పట్టణంతో పాటు ఊరందూరు, అమ్మపాళెం, పుల్లారెడ్డికండ్రిగ ప్రాంతా లను హైపర్‌ సెన్సిటివ్‌గా గుర్తించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌ రెడ్డి కోరారు. బుధవారం ఈ మేరకు ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డితో కలసి జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీకి వినతిపత్రం అందించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 18, 22, 26, 28, 29, 31 వార్డుల్లో అభ్యర్థులు, ఏజెంట్లకు బెదిరింపులు, అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసిన మరుసటి రోజే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు బైండోవర్‌ నోటీసులు జారీ చేయడం, అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకునేలా పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌, కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి స్వగ్రామమైన ఉరందూరులో తమ పార్టీ అభ్యర్థి, పోలింగ్‌ ఏజెంట్‌, వారి కుటుంబ సభ్యులపై వేధింపులు, బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి స్వగ్రామమైన అమ్మపాళెం, పుల్లారెడ్డికండ్రిగలో ప్రచారం చేసుకునేందుకు సైతం ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాళహస్తిలోని 10, 14, 26 వార్డులకు చెందిన పోలింగ్‌ కేంద్రాలు 10/1, 10/2, 14/1, 14/2, 26/1, 26/2 వద్ద ప్రత్యేక భద్రత, వీడియో చిత్రీకరణ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణం, ఊరందూరు, అమ్మపాళెం, పుల్లారెడ్డికండ్రిగ ప్రాంతాల్లో అదనపు సాయుధ పోలీసులు, రిజర్వ్‌ బలగాలను మొహరించాలని, స్థానిక పోలీసు స్టేషన్లకు సంబంధం లేని సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని విన్నవించారు. శ్రీకాళహస్తికి నియమించిన నోడల్‌ అధికారి, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ అధికారుల పేర్లు, మొబైల్‌ నంబర్లతో పాటు 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ను ముందుగానే అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement