శ్రీవారి దర్శనానికి 12 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 59,413 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,015 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

సౌత్‌జోన్‌ పోటీలకు

ఎస్పీడబ్ల్యూ విద్యార్థినులు

తిరుపతి సిటీ : ఎస్వీయూ ఇటీవల నిర్వహించిన అంతర్‌ కళాశాలల గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులు విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం ఈ మేరకు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ భీమన్న మాట్లాడుతూ అకడమిక్‌ విద్యతో పాటు క్రీడలను ప్రొత్సహిస్తున్నామని, ఎంతో మంది విద్యార్థినులు క్రీడలలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని ప్రశంసించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థినులను అభినందించారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ భారతి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ విద్యుల్లత పాల్గొన్నారు.

ముక్కంటి హుండీ లెక్కింపు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రధాన హుండీలతోపాటు పరివార దేవతల వద్ద హుండీలను బుధవారం కొట్టు మండపంలో లెక్కించారు. అక్టోబర్‌ 28 నుంచి మంగళవారం వరకు హుండీ ద్వారా స్వామివారికి రూ.1,80,56,372 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బంగారం 17 గ్రాములు, వెండి 404,800కిలోలు, విదేశీ కరెన్సీ 129 వచ్చినట్లు వివరించారు.

29న తిరుమలలో

కార్తీక వన భోజనం

తిరుమల : తిరుమల గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో ఈ నెల 29వ తేదీన కార్తీక వన భోజనం నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీమలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయదేవేరీలు పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం జరిపించనున్నారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు కార్తీక వనభోజన చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే శ్రీవారి అలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.

పర్మిట్‌ లేని వాహనం

నడిపితే కేసు

తిరుపతి మంగళం : పర్మిట్‌ లేకుండా వాహనాలను నడిపే వారిపై మోటారు వాహన చట్టం, 1988లోని సెక్షన్‌ 192 కింద కేసులు నమోదు చేసి, రూ.10వేల వరకు జరిమానా విధించడంతోపాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌ హెచ్చరించారు. బుధవారం తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలువురు వాహన యజమానులు ఆనన్‌లైన్‌ ద్వారా తమ వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నప్పటికీ, రవాణా పర్మిట్లు పొందకుండా వాహనాలను నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా మోటార్‌ క్యాబ్స్‌, ఆటోల యజమానులు విధిగా పర్మిట్‌ తీసుకోవడంలేదన్నారు. పర్మిట్‌ లేకుండా, చట్టబద్ధమైన అనుమతులు లేకుండా వాహనం నడిపే సమయంలో ప్రమాదం సంభవిస్తే, బీమా క్లెయిమ్‌కు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో నిర్ణీత రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో ఐదేళ్ల వరకు పర్మిట్‌ పొందవచ్చని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement