అధికారం.. | - | Sakshi
Sakshi News home page

అధికారం..

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించారు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల నామినేషన్ల తిరస్కరణ అంకెలు, సంతకాలను ఫోర్జరీ చేయించిన ఆర్వోలు టీడీపీ నేతల ఒత్తిళ్లతో అప్పీళ్లకూ అనుమతించని వైనం ఎంపీపీ ఎన్నిల్లోనూ టీడీపీ కోసం ఆరాటం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు చేసేందుకు ఆర్వోలు అడుగడుగునా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. నామినేషన్‌ పత్రాల్లో ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించి టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం బరితెగించి పనిచేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల మొదలు.. కౌంటింగ్‌, ఆ తర్వాత జరుగుతున్న ఎంపీపీ ఎంపిక వరకు ఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తొట్టంబేడు మండలం రౌతుసూరమాల సర్పంచ్‌ అభ్యర్థి జల్లిపాపయ్య నామినేషన్‌ పత్రంలో చూపించిన ఆస్తి విలువలోనూ మార్పులు చేశారు. రూ.5 వేల నగదు, రూ.70 వేలు విలువచేసే ద్విచక్ర వాహనంతో కలిపి మొత్తం రూ.75 వేలు ఉందని అఫిడవిట్‌లో స్పష్టంగా చూపించారు. రూ.75లోని 5ని 6గా దిద్ది నామినేషన్‌ని తిరస్కరించారు. ఇదే మండలం కొత్తకండ్రిగ సర్పంచ్‌ అభ్యర్థి పి.విమలమ్మ ప్రపోజర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ప్రపోజర్‌కి ఇంగ్లీష్‌లో సంతకం చేయడం తెలియదు. నామినేషన్‌ పత్రంలో తెలుగులోనే సంతకం చేశారు. ఎన్నికల అధికారి.. తెలుగులో సంతకం చేసి ఉన్న పేపర్‌ని చించివేసి.. దాని స్థానంలో మరో పేపర్‌ని చేర్చారు. అందులో ప్రపోజర్‌ ఇంగ్లీష్‌ సంతకం చేసినట్లు చూపించి విమలమ్మ నామినేషన్‌ని తిరస్కరించారు. మరో అభ్యర్థి చదువుకోనేలేదు. నామినేషన్‌లో ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్‌ లేదని తిరస్కరించారు. అలా బోనుపల్లి, పల్లం, పాతవీరాపురం, పాగాలి, వికృతమాల సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.

ఎందుకు తిరస్కరించారో కూడా చెప్పరట

శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 22, 31 వార్డులకు కౌన్సిలర్‌ అభ్యర్థులుగా మస్తాన్‌, లీలా ఈనెల 17న నామినేషన్లు వేశారు. వాటిని ఆమోదించినట్లు ఆర్వో ప్రకటించారు కూడా. ఏమైందో ఏమో.. సాయంత్రానికి ఆ ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లు ప్రకటించారు. నామినేషన్లు ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో.. కారణాలు చెప్పాలని అడిగితే ఆర్వో సమాధానం ఇవ్వలేదు.

ఎంపీపీ ఎన్నికలోనూ అధికార దుర్వినియోగం

మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికలోనూ టీడీపీ నేతలు, ఆర్వోలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వెంకటగిరి మండలంలో వైఎస్సార్‌ సీపీ 4, టీడీపీ 4 ఎంపీటీసీ స్థానాలను కై వసం చేసుకున్నాయి. ఎంపీపీని ఎన్నుకునేందుకు గురువారం ఏర్పాటు చేసిన బలనిరూపణ సమయంలో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేసేందుకు టీడీపీ మూకలు లోనికి చొరబడ్డారు. ఆ సమయంలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అక్కడే ఉండటంతో టీడీపీ మూకల ఆటలు సాగనివ్వలేదు. ఎటువంటి అధికారం లేని వ్యక్తులను లోనికి పంపటంపై పోలీసులు, అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను రకరకాల ప్రలోభాలకు గురిచేసినా లొంగకపోవటంతో ఎలాంటి కారణం లేకుండానే ఎంపీపీ ఎన్నికను ఆర్వో వాయిదా వేయటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఓజిలిలో టీడీపీ ఎస్సీ సభ్యులు లేక..

ఓజిలి ఎంపీపీ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. మండలంలో ఎస్సీలకు కేటాయించిన మూడు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ సభ్యులే గెలుపొందారు. పదవిని చేపట్టాలంటే టీడీపీ తరఫున గెలుపొందిన ఎస్సీ సామాజికవర్గం ఎంపీటీసీలు ఎవరూ లేరు. దీంతో టీడీపీ తరఫున గెలుపొందిన ఏడుగురు సభ్యులు గైర్హాజరయ్యారు. కోరం లేదని ఎన్నికల అధికారి ఎన్నిక వాయిదా వేశారు. ఎంపీపీ పదవి వైఎస్సార్‌ సీపీకి అప్పగించాల్సి వస్తుందని భావించి వారు హాజరుకాలేదన్న విమర్శలు ఉన్నాయి.

పోలీసుల సమక్షంలో ఎంపీటీసీ అభ్యర్థులను వెలుపలకు తీసుకువస్తున్న ఎంపీ గురుమూర్తి

పచ్చమూక చేతిలో..

ప్రజాస్వామ్యం బందీ అయ్యింది

అధికార పార్టీకి

యంత్రాంగం దాసోహమైంది

ఆర్వోలు.. భజనపరులయ్యారు..

నిబంధనలను తుంగలోతొక్కేశారు

ఉచ్చనీచాలు మరిచి..

తప్పులపై తప్పులు చేశారు..

ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల

నామినేషన్లు అన్యాయంగా తిరస్కరించారు

ఏకంగా సంతకాలనే ఫోర్జరీ చేసి

420లను తలపించారు..

కళ్లుండీ గుడ్డి వారిలా..

చేవలేని.. చేతకాని వారిలా

ప్రజాసేవకులే.. ప్రజాకంటకులయ్యారు..

ఫలితం..

జిల్లాలో అధికారం.. దుర్వినియోగమైంది..

పచ్చ ముఠాకు పూర్తిగా దాసోహమైంది..!

ఏకగ్రీవాల కోసం ఆర్వోల బరితెగింపు

అప్పీలు చేసుకునే అవకాశమూ లేదు

అభ్యర్థుల నామినేషన్లు ఏదైనా కారణాలు చెప్పి తిరస్కరిస్తే.. 24 గంటల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఎన్నికల కమిషన్‌ నిబంధనల్లో ఉంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, సానుభూతి పరుల నామినేషన్లు అకారణంగా తిరస్కరణ గురైన విషయం తెలుసుకుని అప్పీలు చేసుకునేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. ఆర్వోలు అవకాశం కల్పించలేదని వైఎస్సార్‌ సీపీ నేతలు కలెక్టర్‌, ఆర్డీఓలకు సమాచారం ఇచ్చినా స్పందన కరువైందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో వైఎస్సార్‌ సీపీ నేతలు ఆధారాలతో గురువారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

కిడ్నాప్‌ చేసేందుకు కుట్రలు

వాకాడులో టీడీపీకి ఎస్టీ మహిళా సభ్యులు లేక..

వాకాడు మండల పరిషత్‌ అధ్యక్ష ఎంపీపీ ఎన్నిక తాత్కాలికంగా వాయిదా పడింది. మండలంలో జరిగిన 11 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 5 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఎంపీపీ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. కూటమి తరఫున ఎస్టీ మహిళా ఎంపీటీసీ విజయం సాధించలేకపోయారు. వైఎస్సార్‌ సీపీ తరఫున గెలిచిన వారిలో ఇద్దరు ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఎంపీపీ పదవి వైఎస్సార్‌ సీపీకి దక్కే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో కూటమి ఎంపీటీసీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే బయటకు వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement