తిరుపతి అర్బన్: తిరుపతి జిల్లాలోని 35 మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం ఎంపీపీ (మండల పరిషత్ అధ్యక్షుడు), ఉపాధ్యక్షుల ఎన్నిపికను చేపట్టారు. కోరం లేక ఐదుచోట్ల అధ్యక్షులు, ఆరుచోట్ల వైస్ ఎంపీపీల ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. 30 చోట్ల ఎంపీపీ స్థానాలు, 29 చోట్ల వైస్ ఎంపీపీల ఎన్నికను పూర్తి చేశారు. నాగలాపురం, ఓజిలి, తొట్టంబేడు, వాకా డు, వెంకటగిరి మండలిల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక వాయిదా వేశారు. పిచ్చాటూరు మండలంలో ఉపాధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది.
వైఎస్సార్ సీపీ ఖాతాలోకి పుల్లంపేట, పెనగలూరు మండలాలు
జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట, పెనగలూరు మండలాలు వైఎస్సార్ సీపీ ఖాతాలోకి చేరాయి. పుల్లంపేట ఎంపీపీగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఏ.వైష్ణవి, వైస్ ఎంపీపీగా భీమిశెట్టి కల్యాణి ఎన్నికయ్యారు. పెనగలూరు ఎంపీపీగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు ఎస్.చెంగల్‌రెడ్డి, వైస్ ఎంపీపీగా శ్రీరామ్‌రెడ్డి ఎన్నికయ్యారు.
బీజేపీకి దక్కని ఎంపీపీ స్థానం
జిల్లా వ్యాప్తంగా బీజేపీకి ఎంపీపీ ఒక్క స్థానం కూడా దక్కలేదు. పెళ్లకూరు మండలంలో వైస్ ఎంపీపీ స్థానంలో సరిపెట్టారు. జనసేనకు రైల్వే కోడూరు మండలంలో ఎంపీపీ స్థానాన్ని, ఓబులవారిపల్లి, పాకాల మండలాల్లో వైస్ ఎంపీపీ స్థానాలు అప్పగించారు.


