వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల కిడ్నాప్‌నకు ప్రయత్నం
అడ్డదారుల్లో ఎంపీపీ పీఠం కై వసం
కోర్టుకు వెళతామన్న ఎంపీటీసీలు
సైదాపురం ఎంపీపీ ఎన్నికలోనూ కూటమి నేతలు కుయుక్తులు పన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో చివరకు కుట్రలు, కుతంత్రాలు చేసి ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకున్నారు. ఇందులో ఎన్నికల అధికారి అన్నీ తానై స్వామి భక్తిని చాటుకున్నారు. దీనిపై తాము కోర్టుకు వెళతామని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు పేర్కొన్నారు.
వెంకటగిరి(సైదాపురం): మండల కేంద్రమైన సైదాపురం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఎంపీడీవో కార్యాలయాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎవరినీ లోనికి పంపించకుండా ఆంక్షలు విధించారు. చివరకు మీడియా ప్రతినిధులను కూడా అడ్డుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను ఆర్వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు. ముందుగా 12 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ అభ్యర్థులుగా పోటీ చేసే వారి నుంచి నామినేషన్లను స్వీకరించారు. వైఎస్సార్ సీపీ తరఫున కుంచం సుబ్బయ్య, టీడీపీ తరఫున పొట్టేళ్ల పార్వతమ్మ పోటీ చేశారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్వో తానే స్వయంగా అభ్యర్థుల పేర్లు రాసి ఒక బాక్స్‌లో 5 చొప్పున రెండు బాక్సుల్లో వేశారు. డ్రా కూడా ఆయనే చేశారు. దీన్ని వైఎస్సార్ సీపీ సభ్యులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు. వైస్ ఎంపీపీని కూడా అలాగే ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఎంపీపీగా టీడీపీకి చెందిన పొట్టేళ్ల పార్వతి, వైస్ ఎంపీపీగా పొలంరెడ్డి సునీత ఎన్నికయ్యారు. లక్కీ డ్రాలో ఆర్వో ఇష్టానుసారంగా వ్యవహరించారని, తాము మరో అధికారి ద్వారా చీటి ఎత్తించాలని విన్నవించినా ససేమిరా అనడంపై అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్ సీపీ చీకవోలు, సైదాపురం, అనంతమడుగు, పాలూరు, గిద్దలూరు, చాగణం ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులురాజు, సుబ్బయ్య, మమత, అరుణ, రామారావు, కమలపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై కోర్టుకు వెళతామని తెలిపారు.
స్వామి భక్తి చాటుకున్న అధికారి
సభ్యుల కిడ్నాప్‌నకు ప్రయత్నం
సైదాపురం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా బుధవారం రాత్రి కూటమి నేతలు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. 20 మంది రౌడీ మూకలతో ఇళ్ల వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. ఆ సమయంలో చీకవోలు ఎంపీటీసీ సభ్యుడు గుంటమడుగు శ్రీనివాసులురాజు లేకపోవడంతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. అలాగే గిద్దలూరు ఎంపీటీసీ ఇంటి వద్ద కూడా రౌడీ మూకలు నానా రభస సృష్టించారు.


