డిక్లరేషన్‌ ఇచ్చాక ఎమ్మెల్యే వీరంగం | - | Sakshi
Sakshi News home page

డిక్లరేషన్‌ ఇచ్చాక ఎమ్మెల్యే వీరంగం

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

ధ్రువీకరించిన ఆర్వో ప్రసాదరావు

రద్దు చేయాలని రచ్చచేసిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి

ఎందుకు వచ్చాడని రాద్దాంతం

ఎన్నికల అధికారులపై చిందులు... ఇబ్బంది పడతారంటూ బెదిరింపులు

గట్టిగా ఎదుర్కొని ప్రమాణస్వీకారం

పూర్తి చేసిన ఎంపీపీ అరగ వైష్ణవి

సాక్షి, తిరుపతి: నిబంధనల ప్రకారం ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారంటూ ఆర్వో ఇచ్చిన డిక్లరేషన్‌ను రద్దు చేయాలని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ గురువారం పుల్లంపేట ఎంపీడీవో కార్యాలయంలో వీరంగం సృష్టించారు. ఎన్నికల అధికారులపై చిందులేస్తూ ఇబ్బంది పడతారని బెదిరింపులకు దిగారు. దీంతో కొంతసేపు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. వైఎస్సార్‌ సీపీ ఎంపీపీ అభ్యర్థి అరగ వైష్ణవి స్పందించి ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అఽధికారులు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీతో ప్రమాణ స్వీకారం చేయించారు. వివరాల్లోకి వెళితే... పుల్లంపేట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆర్వో ప్రసాదరావు ఆధ్వర్యంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్సార్‌ సీపీ ఆరు, కూటమి ఐదుచోట్ల విజయం సాధించాయి. ఎంపీపీ స్థానాన్ని దక్కించుకోవాలని కూటమి నేతలు బెదిరించడం, ప్రలోభాలకు గురిచేస్తున్నారని, తమకు రక్షణ కల్పించమని వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీపీ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఎంపీటీసీలకు అవసరమైన భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుమారు 50 మంది పోలీసుల భద్రత కల్పించారు. అన్ని పార్టీల ఎంపీటీసీలు హాజరై ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. ఎంపీపీగా వైఎస్సార్‌ సీపీ తరఫున జాగువారిపల్లి ఎంపీటీసీగా గెలుపొందిన అరగ వైష్ణవిని బలపరుస్తూ తనతోపాటు మరో ఐదుగురు ఎంపీటీసీలు చేతులెత్తారు. దీంతో వైష్ణవి ఎన్నికను ధ్రువీకరిస్తూ ఆర్వో ప్రసాదరావు డిక్లరేషన్‌ జారీ చేశారు. ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న సమయంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే రంగప్రవేశం చేశారు.

అధికారుల ఆహ్వానంతోనే వచ్చా..

ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నికకు హాజరుకావాలని ఎన్నికల అధికారులు ఆహ్వానం పంపించడంతోనే తాను వచ్చానని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కూటమి నేతల ఒత్తిడితో బయటకు వెళ్లమని చెప్పడం దుర్మార్గమని, దీనిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎలాగైనా గొడవచేసి వాయిదా వేయాలన్న కూటమి నేతలు, అధికారుల కుట్రలను గ్రహించి ఎమ్మెల్సీ ఎన్నికల గది బయటకు వెళ్లి సజావుగా జరిగేలా సహకరించారు.

పుల్లంపేట ఎంపీపీగా వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అరగ వైష్ణవి

రద్దు చేయాలంటూ బెదిరింపులు

ఎంపీపీ ఎన్నిక సమయంలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఎందుకు వచ్చారంటూ ఎన్నికల అధికారులతో ఎమ్మెల్యే శ్రీధర్‌ వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీని ఎలా రానిచ్చారు. మీపై కోర్టుకు వెళ్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎంపీపీ ఎన్నిక రద్దు చేసి వాయిదా వేస్తేనే ఇక్కడి నుంచి కదులుతానంటూ సుమారు గంటసేపు ఆర్వోపై ఒత్తిడి తెచ్చారు. ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ సమయంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఎన్నికల గదిలో లేరని, నిబంధనల మేరకు ఎంపీటీసీల ఆమోదంతోనే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక జరిగిందని ఆర్వో ప్రసాదరావు స్పష్టం చేశారు. ఎన్నిక ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు వీడియో రికార్డు చేశామని చెప్పినా ఎమ్మెల్యే వీరంగం ఆగలేదు. తిరుపతి జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు. చివరకు ఎంపీపీగా ఎన్నికై న అరగ వైష్ణవి జోక్యం చేసుకుని ఆర్వోతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఎన్నిక పూర్తయిందని, తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరడంతో అధికారులు దిగివచ్చారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ సమక్షంలోనే ఎంపీపీగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసి గెలుపు ధృవీకరణ పత్రాలతో వైష్ణవి బయటకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement