విద్యార్థులు కావలెను | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు కావలెను

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

మూడో విడత కౌన్సెలింగ్‌ పూర్తి.. 50 శాతానికి మించని అడ్మిషన్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల కోతతోనే ఈ దుస్థితి

విద్యాసంస్థలు, వర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమే

ఉన్నత విద్యకు..

తిరుపతిలోని ఎస్వీయూ

పరిపాలనా భవనం

తిరుపతి సిటీ: ఒకప్పుడు విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించి ఉన్నత విద్య నభ్యసించడమంటే ఎంతో గౌరవంగా భావించేవారు. విశ్వవిద్యాలయాల్లో సీట్లకు భారీగా గిరాకీ ఉండేది. పోటీ ఎక్కువగా ఉండడంతో వడపోత కోసం యూనివర్సిటీ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. అదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు లేక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. అడ్మిషన్ల ప్రక్రియలో ప్రభుత్వ చేస్తున్న జాప్యం ప్రధాన కారణమైతే ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులో ప్రభుత్వ వైఖరి, స్కాలర్‌షిప్‌ల ఎగవేత వంటి కారణాలతో విద్యార్థులు అధిక శాతం మంది పీజీ, డిగ్రీ కోర్సుల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల మనుగడ ప్రశ్నార్థకమేనని మేధావులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు ఆవేదన చెందుతున్నాయి.

డిగ్రీలో 50 శాతం మించని అడ్మిషన్లు

తిరుపతి జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడస్తున్న సుమారు 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 50 శాతం ప్రవేశాలు జరగకపోవడం గమనార్హం. కాగా జిల్లాలోని 108 వరకు ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అందులో 25 కళాశాలల్లో తప్ప మిగిలిన కళాశాలల్లో కేవలం 45 శాతంకు కూడా అడ్మిషన్లు కాని దుస్థితి. ఇందుకు ప్రధాన కారణం గత రెండేళ్లుగా ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించకపోవడం, నూతనంగా డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని గ్యారెంటీ ఇవ్వకపోవడంమేనని విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయి.

పీజీ కోర్సుల్లోనూ..

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్వీయూ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఏపీ పీజీసెట్‌–2026 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా రెండు విడతల్లో చేపట్టారు. ఇప్పటి వరకు సైన్స్‌ విభాగంలో మాత్రం కాస్త మెరుగైన ప్రవేశాలు జరిగాయి. ఆర్ట్స్‌ గ్రూప్‌ల్లో వెయ్యి సీట్లకు గాను 200 సీట్లను సైతం భర్తీ చేయలేదు. ఇక స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ చేపడతారా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ లేకుండా ఆయా కళాశాలలు మేనేజ్‌మెంట్‌ కోటా కింద మిగిలిన సీట్లను భర్తీ చేసుకోవాలనే సంకేతాలు ప్రభుత్వం నుంచి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి తరుణంలో యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

అడ్మిషన్లు పెరగాలంటే ఏం చేయాలి

ప్రతి ఏడాదీ సకాలంలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు చేపట్టడం, నూతన కోర్సులను ప్రారంభించడం, ఉపాధిపై భరోసా ఇవ్వడం, కొత్తతరం విద్యార్థులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి సారించడం, నాణ్యత కలిగిన విద్యను అందించేందుకు సరిపడా బోధనా సిబ్బందిని నియమించాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఉపాధి ఆధారిత కొత్త కోర్సులను ప్రారంభించి ప్రస్తుతం ఉన్న కోర్సుల్లో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను నవీకరించాలని సూచిస్తున్నారు. ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల్లో కృత్రిమ మేధ వంటి సబ్జెక్టులను తీసుకురావాలని, అప్పుడే న్యాక్‌, ఏఐఆర్‌ఎఫ్‌ వంటి జాతీయ సంస్థల నుంచి మంచి ర్యాంకింగులు సాధించే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. లేకుంటే ‘విద్యా కెనిబాలిజం’ పెచ్చరిల్లి అది ప్రైవేటు యూనివర్సిటీలకు వరప్రదాయని మారే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తిరుపతి జిల్లాలో డిగ్రీ ప్రవేశాలు ఇలా

కళాశాల మొత్తం సీట్లు భర్తీఅయిన సీట్లు మిగిలిన సీట్లు

ఎస్పీడబ్ల్యూ 1,550 1,364 196

ఎస్‌జీఎస్‌ 1,068 711 353

ఎస్వీ ఆర్ట్స్‌ 1,417 1,198 219

ప్రభుత్వ కళాశాలల్లో – 45 శాతం (మూడు విడతల కౌన్సెలింగ్‌లో)

ప్రైవేటు కళాశాలల్లో – 62 శాతం (మూడు విడతల్లో)

పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

సైన్స్‌ కోర్సుల్లో – 87 శాతం (ఏపీపీజీసెట్‌–2026 రెండు కౌన్సెలింగ్‌లో)

ఆర్ట్స్‌ కోర్సుల్లో – 44 శాతం (రెండో విడతల ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేనాటికి)

మిగిలిన సీట్ల భర్తీకోసం స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియపై ఇప్పటి వరకు ప్రకటన లేదు.

డిగ్రీ, పీజీ కళాశాలల్లో అంతంతమాత్రంగానే ప్రవేశాలు

ఉన్నత విద్య నిర్వీర్యం

డిగ్రీ, పీజీ ప్రవేశాలు భారీ స్థాయిలో పడిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారమని స్పష్ట మవుతోంది. ఇంటర్‌ ఫలితాలు విడుదలై ఆరు నెలలు గడచిన తరువాత డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడం, నవంబర్‌ జరుగుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.

టీటీడీ విద్యాసంస్థల్లో అంతంతమాత్రమే

టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న డిగ్రీ కళాశాలల్లో యూజీ ప్రవేశాలు ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఎస్పీడబ్ల్యూ కళాశాలలో అడ్మిషన్లు కాస్త మెరుగ్గా కనిపించినా మిగిలిన ఎస్వీ, ఎస్‌జీఎస్‌ కళాశాలల్లో సుమారు 300కు పైగా ఖాళీలు ఉన్నాయి. సకాలంలో ప్రవేశాలు చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మూడో విడత ప్రవేశాల ప్రక్రియ ఈనెల 7వ తేదీ పూర్తికాగా ఇక స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను ఎప్పుడు చేపడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement