తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజును ఆన్‌లైన్ ద్వారా బుధవారం నుంచి చెల్లించవచ్చని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 11 నుంచి ఆలస్య రుసుముతో డిసెంబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. పరీక్ష ఫీజును ‘బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్ ద్వారా ఆయా పాఠశాలల లాగిన్‌తోనే చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరీక్ష ఫీజుతో పాటు ఒకేషనల్, మైగ్రేషన్ సర్టిఫికెట్ కావాల్సిన వారు ఈ వెబ్‌సైట్ ద్వారానే ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, మూడు సబ్జెక్టులు ఆ పై రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఒకేషనల్ అభ్యర్థులకు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు రుసుము లేకుండా, 26 నుంచి డిసెంబర్ 2 వరకు రూ.50 ఆలస్య రుసుముతో, డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు రూ.200, డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. పది పబ్లిక్ పరీక్ష రాయనున్న వయస్సు తక్కువ గల విద్యార్థులు అండర్ ఏజ్ సర్టిఫికెట్ పొందేందుకు రూ.300 చలానా ద్వారా చెల్లించి డీఈఓ ద్వారా ఉత్తర్వులు పొందాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు అన్ని డాక్యుమెంట్లతో విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని, మాన్యువల్‌గా సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. వీటికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల అధికారిక వెబ్‌సైట్‌లోను, అలాగే డీఈఓ కార్యాలయంలోని అసిస్టెంట్ కమిషనర్‌ను సంప్రందించాలని డీఈఓ సూచించారు.
పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు
తిరుపతి అర్బన్: స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అంతా సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ఫలితాల ప్రకటన వరకు అనుసరించాల్సిన ప్రతి దశపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఆర్డీఓలు, డీడీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, నోడల్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమీక్షలో డీఆర్వో నరసింహులు, జెడ్పీ సీఈవో శోభన్‌బాబు, డీపీవో సుశీలాదేవి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాష్‌రెడ్డి, తిరుపతి స్మార్ట్ ిసిటీ జీఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


