పదేపదే అక్రమ కేసులు పోలీసులను అడ్డుపెట్టుకుని బరితెగిస్తున్న ‘పచ్చ’ బ్యాచ్ స్థానిక ఎన్నికల ముసుగులో మరిన్ని పీటీవారెంట్లు కూటమి తీరుపై దుమ్మెత్తి పోస్తున్న జనం
పెళ్లకూరు: కూటమి అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై జరుగుతున్న రాజకీయ కుట్రలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చిల్లకూరు గ్రామానికి చెందిన కొందరు టీడీపీ రౌడీ మూకలు సత్యనారాయణరెడ్డి నివాసం మీదుగా బాణ సంచా కాల్చి అల్లర్లు సృష్టించారు. ఆయన ఇంటి గేట్లకు తాళాలు వేసి గొడవలు సృష్టించారు. ఈ విషయమై బాధితుడు పెళ్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాని అక్కడి పోలీసులు టీడీపీ రౌడీ మూకలపై కేసులు నమోదు చేయకుండా సత్యనారాయణరెడ్డికి చెందిన 16 మంది అనుచరులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారు. అదేవిధంగా మార్చి 14న కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డితోపాటు మరో 25 మందిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. ఈ కేసు విషయంలో సత్యనారాయణరెడ్డికి బెయిల్ రానియ్యకుండా పాత కేసులు జతచేస్తూ 97 రోజుల పాటు నెల్లూరు సబ్ జైలులో నిర్బంధించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సత్యనారాయణరెడ్డి కామిరెడ్డి గుడ్‌మార్నింగ్ పెళ్లకూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ శ్రేణులు కొత్తూరు, రావులపాడు, పునబాక గ్రామాల్లో సత్యనారాయణరెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకొని ఆయన అనుచరులపై పోలీసులు సమక్షంలో దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారు. ఇందులోనూ పోలీసులు సత్యనారాయణరెడ్డి అనుచరులపై అక్రమ కేసులు పెట్టి బైండోవర్ చేశారు.
ఎలాంటి సంబంధం లేకపోయినా..
అలాగే చిల్లకూరులో వ్యవసాయ పొలాల్లో కూలీలతో రోడ్డు పనులు చేయించుకుంటున్న సత్యనారాయణరెడ్డిపై టీడీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డారు. అదే సమయంలో వడ్డిపాళెం గ్రామానికి చెందిన వలిపి బాలయ్య గొడవల వద్దకు చేరుకుంటున్న తరుణంలో ఘటనా స్థలికి సుమారు వంద మీటర్ల దూరంలో అనారోగ్య సమస్యలతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషయంలో వివాదాలు సృష్టించి, దాడులకు పాల్పడిన టీడీపీ అల్లరి మూకలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సత్యనారాయణరెడ్డికి గానీ, ఆయన అనుచరులకు గానీ ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార పార్టీ నేతల ఆదేశాలతో సత్యనాయణరెడ్డితో పాటు మరో ఆరుగురిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారు.
‘స్థానిక’ంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు
గతంలో రెండు పర్యాయాలు మండలంలోని పది ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీని గెలిపించిన ఘనత సత్యనారాయణరెడ్డిది. అయితే ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు ముందే సత్యనారాయణరెడ్డిని జైల్లో నిర్బంధించి గత విజయాలు పునరావృతం కాకుండా అడ్డుకోవడంపై జనం రగిలిపోతున్నారు. పోలీసుల సహకారంతో పీటీ వారెంట్లు మాటున ఎన్నికలయ్యేంత వరకు జైల్లో నిర్బందించేలా కుట్రలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా జిల్లా ఎస్పీ స్పందించి స్థానిక పోలీసుల తీరుపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రాజకీయ కక్షతోనే
చిల్లకూరులో సత్యనారాయణరెడ్డి ఇంటి స్థలంలోనే టీడీపీ వర్గాలు ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేయడానికి నిశ్చయించారు. విగ్రహ ఏర్పాటులో భాగంగా భూమి పూజకు విచ్చేసిన అనేక మంది టీడీపీ నేతలు నోరు మెదపకుండా కొబ్బరి కాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సత్యనారాయణరెడ్డి ఇంటి ఆవరణ స్థలం సరైనది కాదని ఎక్కువ మంది టీడీపీ సీనియర్ నాయకులు బహిరంగంగా వెల్లడించినప్పటికీ కేవలం రాజకీయ కక్షతోనే కామిరెడ్డి ఇంటి స్థలంలో భూమిపూజ చేశారు.


