బతుకు బలి | - | Sakshi
Sakshi News home page

బతుకు బలి

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? భవన నిర్మాణాల చాటున బలవుతున్న కార్మికులు భవన యజమాని నిర్లక్ష్యానికి ముగ్గురు బలి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు తిరుపతిలో అమలుకాని భవన నిర్మాణ నిబంధనలు

తిరుపతి తుడా: తిరుపతి నగరంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో క్రేన్‌ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాల ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఇలాంటి ఘటనలు తిరుపతిలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. భవననిర్మాణ నిబంధనలు అమలు కాకపోవడంతోనే కార్మికుల ప్రాణాలకు దిక్కు లేకుండా పోతోంది. కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాల పాలవుతున్నారు.

అమలుకాని నిబంధనలు

నగరంలో భవనం నిర్మించాలంటే సంబంధిత మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులు తప్పనిసరి. ప్లాన్‌ ప్రకారం అనుమతులు పొంది అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి. భవనాన్ని నిర్మించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను అమలు చేయడం, ప్లాన్‌ ప్రకారం భవనాన్ని నిర్మించేలా చూడడం టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల ముందున్న మొదటి లక్ష్యం. వార్డు సచివాలయాల రాకతో టౌన్‌ ప్లానింగ్‌ బలోపేతమైంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితోపాటు సుమారు వంద మంది ప్లానింగ్‌ సెక్రటరీలు అందుబాటులో ఉన్నారు. ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి భవన నిర్మాణ నిబంధనలో అమలు చేస్తున్నారా? ప్లాన్‌ ప్రకారం భవనాన్ని నిర్మిస్తున్నారా అని చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. అయితే కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌లో అలాంటి నిబంధనలు అమలు కావడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మంగళవారం భవన యజమాని నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతతో ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

డీబీఆర్‌ రోడ్డులోని సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక సంస్థ పాఠశాల పక్కన జరిగిన ప్రమాదం దారుణమని స్థానికులు ప్రతిపక్షాలు ఆవేదన చెందుతున్నాయి. పాఠశాల నార్త్‌ ఈస్ట్‌ కార్నెర్‌లో హోటల్‌ భవనం నిర్మిస్తున్న క్రమంలో వాస్తు సర్దుబాటు కోసం ప్రైవేటు వ్యక్తులు పాఠశాల ప్రాంగణంలోకి రావడం దారుణమన్నారు.

తప్పిన ముప్పు

స్థానిక వైఎస్సార్‌ మార్గ్‌ (డీబీఆర్‌ రోడ్డు)లో నందిని హోటల్స్‌ యాజమాన్యం డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అనుమతితో భవనాన్ని నిర్మిస్తోంది. మూడు సెల్లార్లు, ఐదు అంతస్తులకు అనుమతులు పొందారు. ఈ భవన నిర్మాణానికి సమీపంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకొనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలోకి భారీ యంత్రాలు వెళ్లి పనులు చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకొని సెల్లార్‌ కోసం భారీ గొయ్యను తీశారు. స్కూల్‌లోకి భారీ వాహనం వెళ్లి అక్కడి నుంచి పనులను కొనసాగించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వందలాది మంది విద్యార్థులు తరగతి గదుల్లో విద్యనభ్యసిస్తున్నారు. భారీ క్రేన్‌ గోతిలోకి కాకుండా స్కూల్‌ భవనం పైకి పడి ఉంటే పెను ప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు పాఠశాల పై పడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పక్కనే స్కూల్‌ ఉందని తెలిసి కూడా ప్రహరీ గోడకు ఆనుకుని భవన యజమాని పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement