సూళ్లూరుపేట: ఆంధ్రా–తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన పులికాట్ సరస్సు సరిహద్దు వివాదం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. సరస్సులో నీళ్లు తగ్గినపుడల్లా సరిహద్దు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాయదొరువు ముఖద్వారం పూడిపోవడంతో ఉత్తరం వైపు సరస్సు పూర్తిగా ఎడారిలా మారిపోయింది. పల్‌వేరికాడ్ ముఖద్వారం వల్ల దక్షిణం వైపు సరస్సులో నీళ్లు పుష్కలంగా ఉండడంతో ఏపీ జాలర్లు దక్షిణం వైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట లాంటి ఏరియాల్లో చేపలవేటకు వెళుతున్నారు. ఆ ప్రాంతం తమిళనాడు పరిధిలోకి వస్తుందని చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాంగోడు కుప్పం, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు ఆంక్షలు విధిస్తున్నారు. చేపల వేటకు వెళ్లి వలలు వేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలలు పెరికేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే ఆంధ్రా పరిధిలోని ఇరకం దీవి పరిసర ప్రాంతాలకు వేటకు వెళితే తమిళనాడు జాలర్లు వివాదాలకు దిగుతున్నారు. గతంలో పడవలు కాల్చివేయడం, కత్తులతో నరికేయడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
సరిహద్దులు తేల్చండి
ఆంధ్రా–తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన పులికాట్ సరస్సు ఏ రాష్ట్రంలో ఎంత విస్తరించి ఉంది అనే విషయాన్ని అధికారులు ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏ రాష్ట్రంలో ఎంత ఉంది! ఎక్కడ దాకా ఉంది! అనే విషయాన్ని తేల్చి చెప్పేస్తే తెలిసినట్టుగా ఉంటుందని జాలర్లు అభిప్రాయ పడుతున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో పులికాట్ సరస్సు సుమారు 600 చ..కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో 460 చ.కి.మీ ఆంధ్ర రాష్ట్రం పరిధిలోని నెల్లూరు జిల్లా తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో విస్తరించి ఉంది. మిగిలిన 140 చ.కి.మీ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలుకా పరిధిలో విస్తరించి ఉంది. పులికాట్ సరస్సులో 16 దీవి గ్రామాలు, 30 తీర ప్రాంత గ్రామాలున్నాయి. ఇందులో ఆంధ్రా పరిధిలో 17, తమిళనాడు పరిధిలో ఏడు ఉన్నాయి.
పట్టించుకోవడం లేదు
పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులు చూపించమని 1989 నుంచి మత్స్యశాఖ అధికారులు, అందుకు సంబంధించిన మంత్రుల వద్దకు తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. 1989లో రెండు రాష్ట్రాల మధ్య జాలర్లకు భారీ ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. 2007లో రాష్ట్ర మత్స్యశాఖామంత్రి మండలి బుద్దప్రసాద్, తమిళనాడు మత్య్సశాఖ మంత్రి కేపీపీ స్వామితో రెండు రాష్ట్రాల మత్స్యశాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మరోమారు ఇటీవల సరిహద్దు వివాదాలపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు గుమ్మిడిపూండి ఎండీఓ కార్యాలయంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించినప్పటికీ మళ్లీ వాయిదా వేశారు. సరస్సులో సరిహద్దులైనా ఏర్పాటు చేయండి.. లేదంటే చేపల వేటను ప్రీజోన్ చేయాలని ఆంధ్రా జాలర్లు, తమిళనాడులోని మరికొంత మంది జాలర్లు కోరుతున్నారు.


