రేణిగుంట: రేణిగుంట–తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్య రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రేణిగుంట రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపారు. వారి కథనం.. రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం ఉందని మంగళవారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రేణిగుంట రైల్వే జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి సుమారు 37 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుడు నారింజ (ఆరెంజ్) రంగు షర్ట్, తెలుపు రంగు టీ–షర్ట్, కుడి చేతిపై హిందీలో ‘జై శ్రీరామ్‘ అని పచ్చబొట్టు (టాటూ) వేసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
క్యాంపస్ డ్రైవ్‌లో
37 మందికి ఉద్యోగాలు
తిరుపతి సిటీ: శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జరిగిన క్యాంపస్ డ్రైవ్‌లో 37 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ప్రద్మావతమ్మ తెలిపారు. కమెట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రూ.3.72లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు కై వసం చేసుకోవడం హర్షణీయమన్నారు.
కలిచేడులో శాంతియుత నిరసన
సైదాపురం: మండలంలోని కలిచేడు మైనింగ్ పాఠశాలతో పాటు ఆస్పత్రిని మైనింగ్ యాజమాన్యం కాపాడాలంటూ మంగళవారం స్టూడెంట్ ప్రొటెక్షన్ రాష్ట్ర అధ్యక్షుడు షఫీహారన్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల, ఆస్పత్రిని అభివృద్ధి చేయాలన్నారు. మైనింగ్ యాజమానులు పన్నులు చెల్లిస్తున్నా ప్రయోజనం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భర్తకు ఏడాది పాటు జైలు
నాయుడుపేట టౌన్: భార్యను చిత్రహింసలు పెట్టిన 2018 సంబంధించిన కేసులో భర్తతో పాటు అత్తమామలు, ఆడ బిడ్డలకు శిక్ష విధిస్తూ మంగళవారం నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కథనం.. 2018లో నాయుడుపేటకు చెందిన చీరల అరుణకుమారిని భర్త ప్రసాద్, అత్త, మామ, ఆడబిడ్డలైన ప్రభాకర్, ప్రమీల, విజయమ్మ అధనపు కట్నం కోసం వేధిస్తున్నట్లుగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి చార్జ్‌షీట్‌ను నాయుడుపేట జూనియర్ సివిల్‌కోర్టులో దాఖలు చేయడంతో జూడీషియల్ ఫస్ట్‌క్లాస్ న్యాయమూర్తి పీ.మీనాక్షి సుందరి సాక్షులను విచారించారు. నేరారోపణ రుజువుకావడంతో ముద్దాయిలైన బాధితురాలి భర్త ప్రసాద్‌కు ఏడాది పాటు జైలుశిక్ష, రూ .5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అదేవిధంగా చీరల ప్రమీలమ్మ, ప్రభాకర్, విజయమ్మకు ఒక్కొక్కరికీ రూ. 2వేల చొప్పున జరిమానా విధించినట్టు పోలీసులు వివరించారు.
వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేయండి
తిరుపతి సిటీ: వేధింపులు ఎక్కువైతే వెంటనే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్‌చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మహిళలకు సూచించారు. జాతీయ మహిళా కమిషనన్ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్‌లో స్టాకింగ్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు చెప్పాలని సూచించారు. తిరుపతి అదనపు ఎస్పీ శ్రీలత, ఎస్‌ఐ జయస్వాములు, న్యాయ నిపుణురాలు డాక్టర్ శ్రావణి, ఎస్వీయూ సైకాలజీ విభాగం సైకాలజిస్ట్, కౌన్సిలర్ డాక్టర్ విశ్వనాథ్‌రెడ్డి, మహిళా కమిషన్ సలహాదారు ఆర్.సూయజ్ పాల్గొన్నారు.


