పిడుగుల కాలం.. అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

పిడుగుల కాలం.. అప్రమత్తత అవసరం

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

ఏర్పేడు: పిడుగుపాటుకు గురై జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నాలుగు రోజుల కిందట ఏర్పేడు మండలం చెల్లూరు సమీపంలోని సదాశివ కోన డ్యాం వద్ద పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జిల్లాలో సెస్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో ఉరుములు, మెరుపులతో కురిసే వర్షం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. కర్షకులు, కూలీలు, పశువుల కాపరులను పిడుగుల రూపంలో మృత్యువు బలి తీసుకుంటోంది. పిడుగుల కాలం అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

మేఘ్‌దూత్‌తో వర్ష సమాచారం

భారత వాతావరణశాఖ (ఐఎండీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సంయుక్తంగా వర్షంపై ముందస్తు సమాచారం తెలియజేసేందుకు ‘మేఘదూత్‌’ యాప్‌ను రూపొందించాయి. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్లోకి వెళ్లి మొబైల్‌ నంబరు, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు నమోదు చేసి లాగిన్‌ అవడం ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా వర్ష, ఉష్ణోగ్రత, గాలి వేగం, గాలి దిశ, గాలిలో తేమశాతం వంటి వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు.

హెచ్చరిస్తున్న దామిని యాప్‌

పిడుగుపాటు నుంచి రక్షించుకునేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియాలజీ, ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా దామిని యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఇది 500 మీటర్ల కంటే తక్కువ వ్యాసార్థంలో పిడుగులు పడే పరిధిని గుర్తించి సమాచారం అందిస్తుంది. దీంతో పిడుగులు పడే ప్రాంతానికి దూరంగా వెళ్లి ప్రాణ, ఆస్తి నష్టాల నుంచి రక్షణ పొందొచ్చు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో బయట ప్రాంతాల్లో ఉన్నవారు ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లి మోకాళ్లపై చేతులు, తలపెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి.

ఎత్తయిన చెట్లు, టవర్ల కిందకు వెళ్లకూడదు.

ఇనుప గొడుగులు వేసుకుని బయటకు వెళ్లరాదు.

మొబైల్‌ ఫోన్లు, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉపయోగించకూడదు.

ఉరుములు, మెరుపులు వచ్చే సమయాల్లో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు, పశువుల కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు ముందుగానే భూమి పొడిగా ఉండే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement