తిరుపతి క్రైం : తిరుపతి పోలీస్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 13 డైరెక్టర్ స్థానాలకు దాఖలైన నామినేషన్లలో పోటీ నుంచి పలువురు అభ్యర్థులు వైదొలగడంతో అన్ని స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సోమవారం నిర్వహించిన ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ పదవులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు దేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై.శ్రీనివాసరావును ఎన్నికల అధికారిగా నియమించారు. ఈ నెల 25న నామినేషన్ల ప్రక్రియ నిర్వహించగా.. 13 డైరెక్టర్ స్థానాలకు వివిధ కేటగిరీల్లో 43 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 27న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి పోటీ నుంచి పలువురు తప్పుకోవడంతో 13 డైరెక్టర్ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీ నూతన కమిటీ ఆఫీస్ బేరర్ల ప్రెసిడెంట్‌గా జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, వైస్ ప్రెసిడెంట్‌గా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఏ.శ్రీనివాసులు, సెక్రటరీగా హెడ్ కానిస్టేబుల్ ఏ.నిరంజన్, అసిస్టెంట్ సెక్రటరీగా హెడ్ కానిస్టేబుల్ ఎం.సోమశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఉమెన్ ఏఎస్‌ఐ టి.ఏ.ప్రభావతి, హెడ్ కానిస్టేబుల్ టీవీ ఆనందకుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శేఖర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.రాజు, డీపీఓ టైపిస్ట్ టీఎం అఫ్జల్, కానిస్టేబుల్ బి.జగదీష్‌నాయక్, కానిస్టేబుల్ ఏ.హరిహరన్, ఉమెన్ కానిస్టేబుల్ డి.రెడ్డి రాణి, కానిస్టేబుల్ పి.ప్రసాద్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.
66 వార్డులు.. 304 పోలింగ్ స్టేషన్లు
తిరుపతి తుడా: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 66 ఎన్నికల డివిషన్లకు సంబంధించి 304 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్ ఎం.జయకృష్ణ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 28న తుది జాబితాకు ఆమోదం తెలిపినట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
25న విద్యుత్ ఉద్యోగుల మహాసభ
తిరుపతి కల్చరల్: తిరుపతిలో అక్టోబర్ 25నన యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ ఎస్‌పీడీసీఎల్ 8వ డిస్కం మహాసభలు నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి తెలిపారు. ఈ మహాసభల నిర్వహణ కోసం సోమవారం వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో 108 మందితో ఆహ్వాన సంఘాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహిస్తోందని విమర్శించారు.


