కాలువపై కబ్జా వెల్లువ! | - | Sakshi
Sakshi News home page

కాలువపై కబ్జా వెల్లువ!

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

● రేణిగుంట జగనన్న కాలనీలో విభిన్న ఘటనలు ● గతంలో 26 మంది పేదల ప్లాట్లు పూడ్చి పంట కాలవ నిర్మాణం ● ప్రస్తుతం ఆ కాలువను పూడ్చి ఇళ్లు నిర్మిస్తున్న అధికార పార్టీ నేతలు ● పట్టించుకోని ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు

రేణిగుంట: మా రాజ్యం.. మాదే భోజ్యం అంటున్నట్టు ఉంది రేణిగుంటలోని అధికార పార్టీ నేతల పరిస్థితి. ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని చెలరేగిపోతున్నారు. భూ ఆక్రమణలతో రెచ్చిపోతున్నారు. పేదల పొట్టకొట్టి దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటిదే ఇప్పుడు రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీ, అడుసుపాళెం జగనన్న కాలనీలో చోటు చేసుకుంది. గత ఆరు నెలల క్రితం కాలనీకి ప్రధాన రహదారి మధ్యలో పంట కాలువ నిర్మించడానికి అధికారులు పూనుకున్నారు. దీని బాధ్యతను స్థానిక అధికార పార్టీ నాయకుడికి కట్టబెట్టారు. ఇలా సుమారు అరకిలో మీటరు వరకు కాలువ నిర్మించారు. ఈ పంట కాలువ నిర్మాణంతో జగనన్న కాలనీలోని 26 మంది లబ్ధిదారులు నష్టపోయారు. వారి పాట్లు పూడ్చి పంట కాలువ నిర్మించారు. నష్టపోయిన బాధితులకు వేరొక చోట పట్టాలిచ్చే ఇస్తామంటూ అధికారులు హామీలు గుప్పించారు. కానీ ఇంతవరకు వారికి ప్లాట్లు ఇవ్వలేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

కాలువ పూడ్చి యథేచ్ఛగా నిర్మాణాలు

అడుసుపాళెం జగనన్న కాలనీలో నిర్మించిన పంట కాలువను అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా పూడ్చివేస్తున్నారు. దానిపై ఎంచక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే మూడు చోట్ల కాలువను పూడ్చివేశారు. ఇందులో రెండు ప్లాట్లు ఒక్కటిగా చేసి నిర్మాణం చేపట్టారు. మరో చోట భవన నిర్మానానికి పూనుకుంటున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు.

అప్పుడే ఇస్తామన్నారు

గత ప్రభుత్వంలో జగనన్న మాకు ఇంటి స్థలాన్ని ఇచ్చారు. గత మార్చి నెలలో మీ స్థలాలు కాలువలో ఉన్నాయని రెవెన్యూ అధికారులు తెలిపి కాలవ తవ్వకాలు చేపట్టారు. మేము అడ్డుకున్నాము. అప్పుడు మీకు వేరొక చోట ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. కానీ ఇంకా ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులను ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదు.

–ఆర్‌.మునెమ్మ, బాధితురాలు,

సూరప్పకసం బీసీ కాలనీ, రేణిగుంట మండలం

సొంతింటి కల నెరవేరలేదు

మా సొంతింటి కలను సాకారం చేసేందుకు గత ప్రభుత్వంలో జగనన్న మాకు అడుసుపాళెం జగనన్న కాలనీలో స్థలాన్ని ఇచ్చారు. ప్రధాన రహదారికి పక్కనే స్థలం రావడంతో ఆనందపడ్డాము. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. గత మార్చిలో మీ స్థలాలు కాలవలో ఉన్నాయని రెవెన్యూ అధికారులు వచ్చి దగ్గరుండి కాలవ తవ్వించారు. మా పరిస్థితి ఏమిటని నిలదీశాము. తహసీల్దార్‌, ఆర్డీవో వచ్చి మీకు వేరొకచోట స్థలం ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎక్కడా ఇంటి స్థలం ఇవ్వలేదు.

–వీ.సౌందర్య, బాధితురాలు సూరప్పకసం,

రేణిగుంట మండలం

పరిశీలించి న్యాయం చేస్తాం

రేణిగుంట తహసీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టాను. అడుసుపాళెం జగనన్న కాలనీలో కాలువ వల్ల స్థలాలు కోల్పోయామని కొందరు నా దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి న్యాయం చేస్తామని వారికి చెప్పాము. కాలువ పూడ్చిన విషయంపై ఇరిగేషన్‌ ఏఈ, వీఆర్‌ఓ వెళ్లి పరిశీలించారు. కాలవను యథావిధిగా ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము.

–శ్రావణ్‌కుమార్‌, తహసీల్దార్‌, రేణిగుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement