చంద్రగిరి: మామిడి టేబుల్ రకాల ఎగుమతులపై ఉద్యానశాఖ, వ్యవసాయ, ప్రాసెస్ట్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీఈడీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం నారావారిపల్లెలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా ఉద్యాన అధికారి జయభరత్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం, ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎగుమతులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఉద్యాన రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ కింద కలెక్షన్ సెంటర్లు, రిటైల్ ఔట్‌లెట్లు, ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు, సోలార్ డ్రయ్యర్ వంటి పథకాలను 35 నుంచి 50 శాతం రాయితీతో అందుబాటులో ఉంచిందన్నారు. ఏపీఈడీఏ అసిస్టెంట్ మేనేజర్ విజయ్ బాలాజీ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏపీఈడీఏ గుర్తింపు పొందిన ప్యాక్ హౌస్‌లలో ఒకటైన వీహెచ్‌టీ (వేపర్ హీట్ ట్రీట్‌మెంట్) యూనిట్, తిరుపతి నుంచే దక్షిణ కొరియా, ఈయూ, యుకే, మిడిల్ ఈస్ట్ దేశాలకు 400 మెట్రిక్ టన్నులకు పైగా పండ్లు ఎగుమతి అయ్యాయని తెలిపారు. అనంతరం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం, పేరూరు నుంచి ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్త డా.ఎం.సునీల్ మామిడిలో పాటించవలసిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో చంద్రగిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విజయభాస్కర్, చంద్రగిరి మండల ఉద్యాన అధికారి ఎస్.శైలజ, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, చంద్రగిరి, పాకాల, ఎర్రవారిపాలెం మండలాల ఉద్యాన రైతు సంఘాలు పాల్గొన్నాయి.


