ప్రజలంటే వెటకారం! | - | Sakshi
Sakshi News home page

ప్రజలంటే వెటకారం!

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

● సీఎం సొంత మండలానికి జెడ్పీ కార్యాలయం ● జిల్లా కేంద్రంలో కాకుండా సీఎం సొంత మండలంలో ఏర్పాటుపై పలువురి అసంతృప్తి ● ఈ నెల 25 నుంచి జెడ్పీ పాలన చంద్రగిరి నుంచే

సొంతూరిపై మమకారం..

తిరుపతి అర్బన్‌: సీఎం చంద్రబాబునాయుడు సొంత మండలమైన చంద్రగిరికి జెడ్పీ కార్యాలయాన్ని కేటాయించారు. సాధారణంగా ఏ జిల్లాలో అయినా జిల్లా కేంద్రంలోనే జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంటారు. జిల్లా కేంద్రం తిరుపతిలో అన్ని కార్యాలయాలు ఉంటున్న తరుణంలో జెడ్పీ కార్యాలయాన్ని కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబునాయుడు తమ సొంత మండలం చంద్రగిరిలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అందరికీ సౌకర్యవంతంగా ఉండేందుకు జిల్లా కేంద్రమైన తిరుపతిలో లేదా జిల్లాకు మధ్య భాగంగా ఉన్న ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు జిల్లా ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోకుండా తన సొంత మండలంలో జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చంద్రగిరి నుంచే పాలన

జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయాన్ని చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 24తో ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో చిత్తూరు జిల్లా పరిషత్‌ను మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా(మదనపల్లిలో)గా విభజించి జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, ఇతర ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 25 నుంచి చంద్రగిరి నుంచే జెడ్పీ పాలన సాగించడానికి అధికారులు నిర్ణయించారు.

ఇది తగునా బాబూ?

24 లక్షల జనాభా కలిగిన తిరుపతి జిల్లా ఎంతో విశాలంగా ఉంది. మూడు రెవెన్యూ డివిజన్లు, 36 మండలాలు, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, రైల్వేకోడూరు, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలు పూర్తిగా.. వెంకటగిరి, నగరి, గూడూరు నియోజకవర్గాలు పాక్షికంగా తిరుపతి జిల్లాలో ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని జెడ్పీ కార్యాలయాన్ని కేటాయించే బాగుండేదనే వాదన బలంగా వినిపిస్తోంది. వీటినేటినీ పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం జెడ్పీ కార్యాలాయన్ని తన సొంత మండలానికి కేటాయించారని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.

జెడ్పీ విభజన తర్వాత స్థానిక ఎన్నికలు

జెడ్పీ విభజన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లోకి వెళ్లడానికి సర్కార్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలు ఉండేవి. అయితే జిల్లా పునర్విభజన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో 36 మండలాలు ఉన్నప్పటికీ తిరుపతి కార్పొరేషన్‌ను మినాహాయిస్తే మిగిలిన 35 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు చేపట్టనున్నారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 877 ఎంపీటీసీలు ఉండేవి. తిరుపతి జిల్లాను పరిశీలిస్తే 253 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావుడిగా జెడ్పీల విభజన జరిగినట్లు చర్చసాగుతుంది.

తిరుపతి జెడ్పీ చైర్మన్‌.. రిజర్వేషన్‌ ఎవరికో?

జెడ్పీ విభజన ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్‌ బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ సారి ఎవరికి కేటాయిస్తారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎవరికి వారు తమ కమ్యూనిటీకే జెడ్పీ చైర్మన్‌ గిరి దక్కుతుందని ఆయా వర్గాలకు చెందిన వారు చర్చించుకంఉటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement