తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి మంగళం ట్రెండ్స్ పాఠశాల ఆవరణలో మంగళవారం సీనియర్స్ బేస్ బాల్ తిరుపతి జిల్లా జట్లు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు 150 మందికిపైగా హాజరైనట్లు తిరుపతి జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సోము రవికుమార్, సాంబశివరావు తెలిపారు. బాలబాలికలకు విడివిడిగా ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో ప్రతిభ కనబరచిన బాలురు 18 మంది, బాలికలు 18 మందితో జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జట్టు ఎంపిక కమిటీ సభ్యులుగా రామకృష్ణ, సత్య, లోకనాథం, దశరథ, అమ్ములు, విద్యాలత, ప్రమీల, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా పీడీలు సురేష్, రూపలత వ్యవహరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మురళి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం సుభాష్‌చంద్రదాస్, సీనియర్ క్రీడాకారులు డేవిడ్, హేంబాబులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ఇంటి పట్టాల పంపిణీ
తిరుపతి అర్బన్: విధి నిర్వహణలో వీరమరణం పొందిన అటవీశాఖ అధికారుల కుటుంబాలకు 13 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వారికి అండగా నిలిశారు. మంగళవారం కలెక్టరేట్‌లో వారికి ఇంటి పట్టాలను అందించారు. వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. 2013లో శేషాచలం కొండల్లో జరిగిన ఈ ఘటనలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్‌ఆర్.శ్రీధర్, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్ కరుణాకరన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టా భూమి న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడంతో ఆ కేటాయింపులు అలానే నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్‌ఆర్.శ్రీధర్ సతీమణి ఇందిర, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్ కరుణాకరన్ సతీమణి ఎన్.హెలెన్ మేరీ తమ సమస్యను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రత్యేక శ్రద్ధతో ఆ సమస్యకు పరిష్కారం చూపించింది. వారి ఇంటి స్థలానికి సంబంధించిన ఇంటి పట్టాను మంగళవారం కలెక్టరేట్‌లో వారికి అందించారు.


