ఆక్రమించినోడిదే భూమి! | - | Sakshi
Sakshi News home page

ఆక్రమించినోడిదే భూమి!

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

పట్టపగలే దర్జాగా దుక్కి దున్నకాలు

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు పంచాయతీ వీకేఆర్‌వై కాలనీ భూ ఆక్రమణలకు అడ్డాగా మారింది. ఈ పరిసర ప్రాంతాల్లో విరివిగా పరిశ్రమలు రావడంతో అక్కడ పొలానికి ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. ప్రభుత్వ డీకేటీ భూమి ఎకరం కోట్లకు పడగలెత్తింది. ఊహించని విధంగా ఈ ప్రాంతంలో భూమి ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో అక్రమార్కుల కళ్లు ఆ భూములపై పడ్డాయి. ఇన్నాళ్లు వీకేఆర్‌వై కాలనీలో గిరిజనులకు కేటాయించిన ఇంటి స్థలాలను దర్జాగా కొనుగోళ్ల పేరుతో ఆక్రమించుకున్నారు. తాజాగా సమీపంలోని పాదిరికుప్పం రెవెన్యూలో గల 1,056 ఎకరాల శోత్రియం భూములపై అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ఆ దిశగా గత నాలుగు రోజులుగా పట్టపగలే శోత్రియ భూముల్లో ఓ వైపు పొలం దన్నకాలు చేపట్టి ఆక్రమణ దిశగా పావులు కదుపుతున్నారు. దున్నిన పొలం సత్యవేడు–చిన్న పాండూరు ప్రధాన రోడ్డు మార్గానికి ఆనుకుని ఉండడంతో ఆ భూములను కబ్జా చేసేందుకు తెరవెనుక కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు షికారీలు ఆక్రమించుకుని, ఆ భూమి తమ పూర్వీకులకు చెందినదిగా బుకాయిస్తూ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగే కొనసాగితే శోత్రియ భూములు పూర్తిగా అక్రమార్కుల పాలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

కనిపించలేదా?

శోత్రియ భూములు ఆక్రమణకు గురవుతున్నా తమకేమీపట్టనట్లు రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతంగా ఉన్న శోత్రియ భూములు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓ వైపు దుక్కి దున్నకాలు, మరో వైపు షికారీల గుడిసెలు.. ఇలా ఆక్రమించినోడిదే భూమి అన్న చందాన అక్రమార్కులు చెలరేగిపోతుఆన్నరు. ఎంతో విలువైన భూములు అన్యాక్రాంతమవుతుంటే నియంత్రించాల్సిన రెవెన్యూశాఖ చోద్యం చూడడం విమర్శలకు తావిస్తోంది.

ప్రధాన రోడ్డుకు రెండు వైపులా ఆక్రమణలు

చిన్న పాండూరు–సత్యవేడు ప్రధాన రోడ్డు మార్గంలోని వీకేఆర్‌వై కాలనీ సమీపంలో రోడ్డుకు తూర్పు, పడమర రెండు వైపుల సుమారు 100 ఎకరాలకు పైగా గత కొద్ది రోజులుగా దుక్కి దున్నకాలు చేపడుతూ ఆక్రమణలకు సిద్ధం చేసుకుంటున్నారు. అంతేగాక దుక్కి దున్నకాలు చేపట్టిన ఆక్రమిత భూమిలో పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఎకరా రూ.10కోట్లకు పైగా విలువ కలిగిన ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణ జరుగుతున్నా కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మిన్నకుండిపోవడం గమనార్హం.

శోత్రియం భూముల్లో దొంగలు పడ్డారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement