తిరుమల: టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు మంగళవారం టీటీడీ బోర్డు సభ్యులు దర్శన్ సతీమణి యశోద దర్శన్ రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పాల్గొన్నారు.
బంగారు ఆభరణాల అప్పగింత
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమలకు వెళ్తున్న తమిళనాడుకు చెందిన భక్తుడు పి.కార్తికేయన్‌సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చెక్‌పాయింట్ వద్ద తన బ్యాగును పొరపాటున మరిచిపోయి వెళ్లారు. వెంటనే సిబ్బంది బ్యాగును గుర్తించి, అందులో లభించిన వివరాల ఆధారంగా భక్తుడిని సంప్రదించి అలిపిరి చెక్‌పాయింట్ వద్దకు రావాలని సమాచారం అందించారు. ఆ మేరకు చేరుకున్న భక్తుడు బ్యాగులోని వస్తువులను గుర్తించి ధృవీకరించిన అనంతరం బ్యాగును సురక్షితంగా ఆయనకు అప్పగించారు. బ్యాగులో రూ.10,900 నగదుతో పాటు రెండు గాజులు, ఒక బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని టీటీడీ సెక్టార్–5 ఏవీఎస్వో రమేష్ తెలిపారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది చూపిన అప్రమత్తత, నిజాయితీతో విలువైన వస్తువులను తిరిగి అప్పగించడంతో భక్తుడు కృతజ్ఞతలు తెలిపారు.
వృద్ధురాలి హత్య
– ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం
రైల్వేకోడూరు: రైల్వేకోడూరు పట్టణంలోని వినాయక నగర్‌లో రాజుపాళెం మంగమ్మ (70) అనే వృద్ధురాలు హత్యకు గురైన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఒంటరిగా నివసిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి వద్ద ఉండాల్సిన సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, చెవి దిద్దులు, ఉంగరం, చంద్రముఖి మోడల్ గొలుసు కనిపించకపోవడంతో బంగారు ఆభరణాల కోసం హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయడంతోపాటు చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
వ్యభిచార గృహంపై దాడి
తిరుపతి క్రైం: నగరంలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు మంగళవారం ఓ లాడ్జీపై దాడి చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీసాయి లక్ష్మి లాడ్జీలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో బుధవారం మధ్యాహ్నం 12.15 నుంచి 1.45 గంటల మధ్య ఈస్ట్ ఇన్‌న్‌స్పెక్టర్, ఈస్ట్ డబ్ల్యూఎస్‌ఐ సుమతి, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా లాడ్జీలోని రూమ్ నం.201లో ఓ మహిళ, వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీనివాసులు, అతని భార్య సుకన్య వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, లాడ్జీ మేనేజర్ కూడా ఇందులో పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌న్‌కు తరలించి సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, శ్రీనివాసులుపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది. 2016లో ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో 2026 జూన్ 30న కర్ణాటక పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. అతడిపై చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషనన్‌లోనూ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.


