తిరుపతి క్రైం : రుయా ఆస్పత్రి ఆవరణలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.
ఎంఆర్‌ఐ స్కానింగ్ ఎదురుగా..
ఎంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రం ఎదురుగా గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు అతడిని గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. అలాగే ఎంఆర్‌ఐ స్కానింగ్ విభాగం ఎదురుగా మరో వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే, సురేష్ (55), ధర్మపురి పేరుతో ఉన్న ఓపీ చీటీ మాత్రమే లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్‌నినోపై రైతులకు అవగాహన
తిరుపతి రూరల్: ఎల్‌నినో ప్రభావంతో పంటలు, పశుసంపదకు ఎదురయ్యే నష్టాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతి జిల్లా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం, వేమూరు గ్రామంలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ షణ్ముగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ చిట్టిబాబు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పించారు. పంటలు, పశుసంపదను సంరక్షించుకునేందుకు పీఎండీఎస్, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎం.ఊహ, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ దామా అయ్యప్పనాయుడు, వెటర్నరీ అసిస్టెంట్ దేవిక, ఐసీఆర్‌పీ శ్రావణి పాల్గొన్నారు.
బీటెక్ ప్రవేశాల
గడువు పొడిగింపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ (స్వీడన్) కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశాల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. గతంలో ఈనెల 20వ తేదీ వరకు ప్రవేశాలకు తుది గడువుగా నిర్ణయించిన అధికారులు ఆసక్తిగల విద్యార్థుల కోసం మరో అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. కాగా ఈ కోర్సులో చేరిన విద్యార్థులు వర్సిటీలో మూడేళ్లు, స్వీడన్‌లోని బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏడాది పాటు విద్యనభ్యసించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు కోసం ఎస్వీయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
సూళ్లూరుపేట: పట్టణంలోని శ్రీచెంగాళమ్మ లేఅవుట్ వద్ద సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. నాయుడుపేట డీఎస్పీ జీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులు మృతుడిపై దాడి చేసి ఆపై హత్య చేసి, మృతదేహాన్ని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద పడేసి ఉంటారని పోలీసులు అనిమానం వ్యక్తం చేశారు. మృతుడికి సంబంధించి ఏదైనా సమాచారం తెలిసినట్టయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సూళ్లూరుపేట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


