తిరుపతి లీగల్: రేణిగుంట మండలం, తూకివాకం, ఎస్‌ఎన్ పురానికి చెందిన ఏ.కృష్ణమూర్తి తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక కోటి 8 లక్షలకు ఐపీ దాఖలు చేసినట్టు ఆయన తరఫు న్యాయవాది ఆరేపల్లి ఈశ్వరయ్య తెలిపారు. పిటిషన్లోని వివరాల మేరకు.. పిటిషనర్ కృష్ణమూర్తి 2020 నుంచి సీజనల్ వ్యాపారం నిర్వహించేవాడు. వ్యాపారం కోసం అతను అధిక వడ్డీలకు పలువురు నుంచి డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఖాళీ ప్రోనోట్లు, ఖాళీ చెక్కుల్లో అతను సంతకాలు చేసి రుణదాతలకు ఇచ్చాడు. దేశంలో కరోనా రావడంతో వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతోపాటు అతను అనారోగ్యానికి గురయ్యాడు. రుణదాతలు ఎక్కువ మొత్తంలో సొమ్ము చెల్లించాలని వేధించసాగారు. దీంతో సొమ్ము చెల్లించలేని స్థితిలో ఐపీ దాఖలు చేసినట్టు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 12 మంది రుణదాతలను ఆయన పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నాడు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,012 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,345 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.5 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
శ్రీవారి సేవలో
ఉడిపి ఆద్మార్ మఠాధిపతి
తిరుమల : ఉడిపిలోని ఆద్మార్ మఠాధిపతి, పరమపూజ్య విశ్వప్రియ తీర్థ స్వామీజీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామీజీకి బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ పేష్కర రామకృష్ణ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామీజీకి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించి సత్కరించారు.
పౌరసంబంధాల అధికారిగా సరస్వతిబాయి
తిరుపతి అర్బన్: జిల్లా పౌరసంబంధాల అధికారిగా పూజారి సరస్వతిబాయి సోమవారం కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాద పూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిశారు. కడప నుంచి బదిలీపై ఆమె తిరుపతి జిల్లాకు విచ్చేశారు. రెండేళ్లు క్రితం జిల్లా పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన విజయసింహారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు తాజాగా భర్తీ చేశారు.
ఎర్రచందనం కేసులో
ఒకరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, మంగళాపురానికి చెందిన పీ.సురేష్‌కు ఐదేళ్లు జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ...ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో తిరుపతి డివిజన్, తిమ్మినాయుడుపాళెం సెక్షన్, అలిపిరి ఫారెస్ట్ బీట్, శేషాచలం అటవీ ప్రాంతం, ఎన్సీసీ ఫైరింగ్ రేంజ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. నిందితుడు సురేష్ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నించాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు సురేష్‌కు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


