తిరుపతి తుడా: తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో పూర్తి నిర్మాణానికి నోచుకోక అర్ధంతరంగా నిలచిపోయిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌పై సాక్షి దినపత్రికలో సోమవారం ‘మా రాజ్యం మాదే భోజ్యం’ శీర్షికన ప్రచురించిన కథనానికి నగరపాలక సంస్థ వివరణ ఇచ్చింది. తమిళనాడు చెందిన బిల్డర్ భవాన్ని మూడు అంతస్తులు పూర్తి చేశారని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో అర్ధంతరంగా నిలిపి వేశారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 36వ సమావేశంలో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించామని, కేవలం కన్యకా ఇన్‌ఫ్రా ప్రెవేట్ లిమిట్ సంస్థ ఒక్కటే బిడ్ సమర్పించిందని పేర్కొన్నారు. సదరు సంస్థ గతంలో పూర్తయిన పనుల కోసం రూ. 20.08కోట్లు చెల్లించేందుకు అంగీకరిస్తూ మిగిలిన పనులను పూర్తి చేయనున్నారని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేవని ఆ ప్రకటనలో తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 107 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 107 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఏఐ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది డిసెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ (ఐసీఏఆర్–2026)’ పోస్టర్‌ను వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వీ.ఉమ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష, కన్వీనర్ ప్రొఫెసర్ పీ.వెంకటకృష్ణతో కలసి సోమవారం ఆవిష్కరించారు. ‘కృత్రిమ మేధస్సులో డేటా, హార్డ్‌వేర్, ఫిన్‌టెక్ సమగ్రతతో నూతన సాంకేతిక సరిహద్దుల అభివృద్ధి’ అనే అంశంతో డీఎస్‌టీఎస్‌టీ–క్యూరీ–ఏఐ సెంటర్ ఆధ్వర్యంలో ఈ సదస్సు హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్టు వీసీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏఐ హార్డ్ వేర్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, ఫిన్‌టెక్, అంతరశాఖ పరిశోధనలపై పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నట్టు ఆమె తెలిపారు. పూర్తి పరిశోధనా పత్రాల సమర్పణకు ఆగస్టు 10 చివరి తేదీ కాగా, ఎంపికై న పత్రాలను సెప్టెంబర్ 10న ప్రకటిస్తామని, కెమెరా రెడీ పేపర్ల సమర్పణకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంటుందన్నారు. ఉత్తమ పత్రాలు, విద్యార్థుల పరిశోధనలు, మహిళా పరిశోధకుల ప్రజెంటేషన్లు, ఆవిష్కరణలకు ప్రత్యేక అవార్డులు అందజేస్తామన్నారు. దేశ, విదేశాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. చీఫ్ కన్వీనర్ ప్రొఫెసర్ జి.వి.ఆర్.శాస్త్రి ఆధ్వర్యంలో, కన్వీనర్ ప్రొఫెసర్ పి.వెంకటకృష్ణ సమన్వయంతో సదస్సు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.


