ఆధ్యాత్మిక క్షేత్రంలో అలజడి! | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక క్షేత్రంలో అలజడి!

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

● ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమంపై వ్యాసాశ్రమ పరిరక్షణ సమితి రచ్చరచ్చ ● మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగా నడపడం లేదని ఆరోపణ ● ఆశ్రమ ఆస్తులను అమ్ముకున్నారని విమర్శ ● సంస్కరణల కోసం నూతన కమిటీ అవసరమన్న పరిరక్షణ సమితి ● ఆశ్రమ పీఠాధిపతితో చర్చలు విఫలం ● వివాదాలకు తెర పడేది ఎన్నటికో?

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ‘ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమం.. కేరళ రాష్ట్రంలో జన్మించిన మలయాళ యత్రీంద్రులు 1926లో ఏర్పేడు సమీపంలోని నంది కొండల దిగువ భాగాన శ్రీవ్యాసాశ్రమాన్ని నెలకొల్పారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆశ్రమం శైందవ సనాతన ధర్మ వ్యాప్తికి దేశ, విదేశాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు, కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా గతంలో ఇక్కడ పని చేసిన స్వామీజీలు, పూర్వ విద్యార్థులు, కొందరు భక్తులు కలసి శ్రీవ్యాసాశ్రమ పరిరక్షణ సమితి పేరుతో వ్యాసాశ్రమంలో పాలన గాడి తప్పిందని, సంస్కరణలు అవసరమని ఆశ్రమానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. వ్యాసాశ్ర పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి ఆశ్రమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని, భక్తులకు ఆశ్రమంలో పలికి రానివ్వకుండా గేట్లు పెట్టి మోకాలడ్డుతున్నారని విమర్శిస్తున్నారు. గతంలో ఉన్న వేదవిద్య పాఠశాల, కంటి వైద్యశాలలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఆశ్రమానికి చెందిన కొన్ని భూములు విక్రయించి, ఆ డబ్బులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తం 21 డిమాండ్లతో ఇప్పటికే ఆశ్రమానికి వ్యతిరేకంగా బలగాన్ని కూడగట్టి పోరుబాట పట్టారు. దీనికి శ్రీనివాస మంగాపురంలోని వశిష్ట ఆశ్రమ పీఠాధిపతి స్వస్వరూపానంద స్వామి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వెంట గతంలో వ్యాసాశ్రమంలో మలయాళ స్వామి, రెండవ పీఠాధిపతి విద్యానందగిరి స్వామి శిష్యలుగా ఉన్న పలువురు స్వాములు జత కట్టారు. ఇప్పటికే వీటన్నింటిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులోనూ కేసు వేశారు. ఈనెల 25వ తేదీన జరిగిన వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మలయాళస్వామి 64వ ఆరాధనోత్సవానికి వీరంతా ఆశ్రమానికి విచ్చేసి, ఆశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామితో చర్చలు జరిపారు. అయితే వీరి డిమాండ్లను విన్న పీఠాధిపతి.. ఆగస్ట్‌ 27వ తేదీ నుంచి వ్యాసాశ్రమం శతజయంతోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించేందుకు తాము ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నట్లు వివరించారు. ఆశ్రమ శతజయంతోత్సవాలు పూర్తయిన తర్వాత మరోసారి చర్చించి, అందరికి ఆమోదయోగ్యమైన సంస్కరణలను చేపట్టే చర్యలు తీసుకుంటామని ఆయన వారికి చెప్పారు. దీంతో చర్చలకు వెళ్లిన స్వాములు చర్చలు విఫలమైనట్లు ప్రకటించారు. అయితే ఈ వివాదాలకు తెర పడాలని భక్తకోటి కోరుకుంటోంది.

ఏర్పేడు వ్యాసాశ్రమంలోని అధిష్టాన మందిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement