నిర్లక్ష్యంతో.. | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంతో..

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

● వెలవెలబోతున్న కళాశాలలు ● ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా ప్రవేశాలలో జాప్యం ● సిలబస్‌ ఎలా పూర్తి చేయాలంటూ అధ్యాపకుల ఆవేదన ● జిల్లాలో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది విద్యార్థులు

యూజీ, పీజీ సెట్‌ల కౌన్సెలింగ్‌ ప్రక్రియపై ఊసేత్తని ఉన్నత విద్యామండలి

తిరుపతి సిటీ : పీజీ, యూజీ సెట్ల ఫలితాలు విడుదలైనా ఇంతవరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించలేదు. రెండేళ్లుగా ఉన్నత విద్యావ్యవస్థను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల్లో ముందస్తు పీజీ, యూజీ, ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ పిల్లల పరిస్థితి ఏంటనే ప్రశ్నిస్తున్నారు.

బోసిపోతున్న కళాశాలలు

తిరుపతి జిల్లాలో పలు పీజీ, యూజీ కోర్సుల్లో చేరేందుకు సుమారు 70వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏపీఐసెట్‌, ఏపీ లాసెట్‌, ఏపీపీజీఈసెట్‌, ఏపీపీజీసెట్‌, ఏపీఎడ్‌సెట్‌ వంటి ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా అడ్మిషన్లు చేపట్టకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. దీనికితోడు ఇంటర్‌ ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియపై ఉన్నత విద్యామండలి ఊసేత్తడం లేదు. జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు టీటీడీ డిగ్రీ కళాశాలల్లోనూ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో విద్యార్థులు లేక బోసిపోతున్నాయి.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

పలు పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన పలు పీజీ సెట్ల ఫలితాలు విడుదలైనా ప్రవేశాల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపైనా క్లారిటీ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలలో, ప్రభుత్వ కళాశాలలో పీజీ, యూజీ ప్రవేశాలు తగ్గడానికి ప్రధాన కారణం కౌన్సెలింగ్‌ ప్రక్రియేనని పేర్కొంటున్నారు. ఉన్నత విద్యామండలి కార్పొరేట్‌ విద్యా సంస్థలలో అడ్మిషన్లు పెంచాలనే కుట్రతో ఇలా కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. వర్సిటీల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోందని మేధావులు, విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

జిల్లాలో ప్రవేశాల కోసం ఎదరు చూస్తున్న విద్యార్థులు

డిగ్రీ కోర్సుల కోసం 32 వేల మంది

పీజీ కోర్సుల్లోకి 6,200 మంది

ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాల కోసం 9,750 మంది

లా కోర్సుల కోసం 7,500 మంది

బీఈడీ ప్రవేశాల కోసం 8 వేల మందికిపైగా

పీజీ, యూజీ–2026 సెట్‌ల వివరాలు

ప్రవేశ పరీక్ష పరీక్ష జరిగిన తేదీ ఫలితాలు విడుదల కౌన్సెలింగ్‌ తేదీ

ఏపీ ఐసెట్‌ మే 2 మే 16 ఊసేలేదు

ఏపీ లాసెట్‌ మే 4 మే 18 ఇప్పటివరకు ప్రకటించలేదు

ఏపీపీజీఈసెట్‌ ఏప్రిల్‌ 28–30 మే 14 ప్రకటించలేదు

ఏపీపీజీసెట్‌ మే 8–11 మే 29 కౌన్సెలింగ్‌ ఊసేలేదు

ఏపీఎడ్‌సెట్‌ మే 8 మే 26 ప్రస్తావనే లేదు

సిలబస్‌ ఎలా పూర్తి చేయాలి

పీజీ, యూజీ కళాశాలల్లో అధ్యాపకుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అడ్మిషన్లు సెప్టెంబర్‌, అక్టోబర్‌ వరకు కొనసాగుతాయని, ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నాలుగు నెలల్లోనే రెండు సెమిస్టర్ల సిలబస్‌ ఎలా పూర్తి చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఉన్నత విద్యామండలి వ్యవహార శైలితో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించలేకపోతున్నామని వాపోతున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఫస్ట్‌ సెమిస్టర్‌కు రెండు నెలలు, రెండో సెమిస్టర్‌కు రెండు నెలల కాలవ్యవధి మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement