అంతర్రాష్ట్ర జేబు దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర జేబు దొంగల ముఠా అరెస్ట్‌

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

తిరుపతి క్రైం : తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని జేబుదొంగతనాలు, నకిలీ టీటీడీ గుర్తింపు కార్డుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుమల టూ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాంభగీచ కార్‌ పార్కింగ్‌ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదు, నకిలీ టీటీడీ ఐడీ కార్డు, సెల్‌ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కర్ణాటకకు చెందిన బాలాజీ అకాడే (33), మహారాష్ట్రకు చెందిన అప్పాషా మానే (65), నెల్లూరు జిల్లాకు చెందిన కల్తీ రెడ్డి కీర్తి (31) ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితులు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని బాలాజీ బస్‌ స్టాండ్‌, ఉచిత బస్సులు తదితర ప్రాంతాల్లో జేబు దొంగతనాలు, పర్సుల చోరీలు, బ్యాగులు కత్తిరించి నగదు, విలువైన వస్తువులు అపహరిస్తున్నట్లు అంగీకరించారని వెల్లడించారు. అలాగే మహిళా నిందితురాలు నకిలీ టీటీడీ గుర్తింపు కార్డుతో తాను టీటీడీ ఉద్యోగినని నమ్మించి, వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు ఏర్పాటు చేస్తానని చెప్పి భక్తుల నుంచి ఫోన్‌న్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల వద్ద నుంచి పర్సు, రూ.5,100 నగదు, మోటార్‌ సైకిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, నకిలీ టీటీడీ గుర్తింపు కార్డు, మూడు సెల్‌ఫోన్లు, కట్టర్‌, చిన్న కత్తి, బ్లేడ్‌లు, గిల్ట్‌ నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వారి నేర చరిత్రపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement