రేణిగుంట: పట్టణంలోని ఓల్డ్ చెక్ పోస్ట్ సమీపంలోని రైల్వే క్రీడా మైదానంలో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఫుట్ బాల్ అంతర్రాష్ట్ర టోర్నమెంట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి మొత్తం 21 జట్లు ఈ టోర్నమెంటులో తలపడునున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆతిథ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లందరికీ క్రీడా ప్రాంగణం వద్దే ఉచిత వసతి, రుచికరమైన భోజన సౌకర్యాలను అందించనున్నట్టు వెల్లడించారు. బరిలోకి దిగుతున్న జట్ల కోసం రూ.1.3 లక్షల భారీ నగదు బహుమతులను ఇదివరకే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ.80వేలు రన్నరప్ గా నిలిచే జట్టుకు రూ.50 వేలు నగదుతో పాటు ప్రతిభ చూపిన ఉత్తమ ప్లేయర్, ఉత్తమ గోల్‌కీపర్ లకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్, కె.మునిరత్నంబాబు, ఎం.దేవదానం తదితరులు పాల్గొన్నారు.


