అధికారానికి దాసోహం! | - | Sakshi
Sakshi News home page

అధికారానికి దాసోహం!

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో రెవెన్యూ, పోలీసుల వింత వైఖరి

ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న టీడీపీ నేతపై చర్యలు శూన్యం

తమ అనుభవంలో ఉన్న 19 సెంట్ల దళితుని స్థలంపై దౌర్జన్యం

ఆపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో దళితుడిపై క్రిమినల్‌ కేసు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: దళితుడి పట్ల వివక్ష.. టీడీపీ నాయకుల పట్ల అధికారులు వల్లమాలిన ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారు. శ్రీకాళహస్తి రూరల్‌ మండలం, ఇనగలూరు పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలే ఇందుకు నిదర్శనం. వివరాలు.. ఇనగలూరు రెవెన్యూ పరిధిలోని జగ్గరాజుపల్లిలో సర్వే నం.107/12, 280/4, 20లోని ఎకరానికిపైగా ప్రభుత్వ, రోడ్డు పోరంబోకు భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకుని ప్లాట్లు వేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఆక్రమణపై సాక్షి దిన పత్రికలో ఈనెల 18న ‘కబ్జా చేసి.. దర్జాగా ప్రహరీ నిర్మించి’ శీర్షికన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏర్పేడు– వెంకటగిరి మార్గంలో ఉన్న ఈ విలువైన ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డును కూడా టీడీపీ నేతలు పీకేశారు. ఈ విషయాన్ని స్థానికలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం.

దళితుడిపై కన్నెర్ర

ఇనగలూరు రెవెన్యూ పరిధిలోని జగ్గరాజుపల్లి దళితవాడకు చెందిన జడపల్లి పాపయ్య అనుభవంలో ఉన్న 2 ఎకరాల పట్టా భూమిని అవసరాల కోసం టీడీపీ నేతకు విక్రయించాడు. ఆ భూమితో పాటు పాపయ్య అనుభవంలోని 19 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమిని వారే స్వాధీనం చేసుకున్నారు. అయితే పాపయ్య తాను రెండెకరాలే విక్రయించింది.. 19 సెంట్లు విక్రయించలేదు కదా అని ప్రశ్నించగా.. ఆ టీడీపీ నేత 19 సెంట్లను తిరిగిచ్చేశాడు. పాపయ్య కుటుంబం అందులో చెట్లు నాడుకుంది. ఈ పరిణామాన్ని జీర్ణియించుకోలేని సదరు టీడీపీ నేత రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి 19 సెంట్లలోని చెట్లను, కంచెను తొలగించారు. అంతటితో ఆగని ఆ నేత పాపయ్యపై రెవెన్యూ అధికారుల చేత పోలీసులకు ఫిర్యాదు చేయించి అక్రమ కేసు నమోదు చేయించారు. ఒకే పంచాయతీ పరిధిలో ఇద్దరి భూ వివాదల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు వివక్ష ప్రదర్శించారు. టీడీపీ నేత ఆక్రమించుకున్న విషయం అధికారయంత్రాగానికి తెలిసినా పట్టించుకోలేదు. అదే ఒక దళితుడి అనుభవంలో ఉన్న 19 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ కేసు నమోదు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దళితుడిపై దౌర్జన్యం.. టీడీపీ నేతపై ప్రేమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement