● పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ సంస్థకు రూ.60 కోట్ల స్థలం ● అద్దె లేకుండానే 31 ఏళ్లపాటు వ్యాపారం చేసుకునే అవకాశం ● తిరుపతి కార్పొరేషన్ ఆదాయానికి తీవ్రమైన నష్టం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ప్రభుత్వం పీపీపీ విధానం అమలు చేస్తూ రాష్ట్ర సంపదను అయినవారికి కట్టబెడుతోంది. అందులో భాగంగానే తిరుపతి నగరంలోని రూ.కోట్ల విలువ చేసే మున్సిపల్ స్థలాలు, భవనాలను అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ స్థలాన్ని గతంలో విక్రయించేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంది. అయితే పీపీపీ విధానం పేరుతో తిరుపతి రైల్వే స్టేషన్ పార్సిల్ విభాగానికి ఎదురుగా ఉన్న 0.85 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను సర్కరు పెద్దలు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేశారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్ నడుమ నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రాంతంలో వాహనదారులకు పార్కింగ్ కష్టాలు తీర్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ సిటీ నిధులు రూ.60 కోట్లతో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. రెండేళ్ల క్రితమే రూ.17 కోట్ల పనులను పూర్తిచేసింది. సెల్లార్‌తోపాటు నాలుగు అంతస్తుల భవనానికి కాంక్రీట్ పనుల పూర్తి చేయించింది.
అద్దె లేకుండానే..
రూ.60 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలానికి ఒక్క రూపాయి అద్దె కూడా లేకుండానే 31 ఏళ్ల పాటు వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు రూ.17 కోట్లు నిధులను ఖర్చు చేశారు. ఈ నిధులను మున్సిపల్ కార్పొరేషన్‌కి తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదిరింది. రూ.కోట్ల విలువ చేసే స్థలానికి నెలవారీ అద్దెను నిర్ణయించకపోవడంలో ప్రభుత్వ కుట్ర తేటతెల్లమవుతోంది. 31 ఏళ్ల పాటు సదరు కాంట్రాక్టరు ఆ భవనాన్ని తన వ్యాపారానికి అనుగుణంగా మార్చుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా వ్యాపార మొత్తంలో కార్పొరేషన్‌కు కేవలం 5.5 శాతం మాత్రమే చెల్లించేలా ఆదేశించడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడనుంది. రూ.లక్ష వ్యాపారం జరిగితే అందులో కార్పొరేషన్‌న్‌కు కేవలం రూ.5,500 వేలు మాత్రమే వస్తుంది. ఏది ఏమైనా నగరంలో అత్యంత రద్దీ ప్రాంతంలోని రూ.60 కోట్ల స్థలానికి ప్రభుత్వ పెద్దలు ఎసరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.


