తిరుపతి ఎడ్యుకేషన్ : అమరావతి చాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి క్రీడాపోటీలను మంగళవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారి ఎన్.శశిధర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వివిధ క్రీడాపోటీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా 28న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్, చెస్, యోగా, 29న హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ పోటీలు ఉంటాయని వివరించారు. తిరుపతికి సంబంధించి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీయూస్టేడియం, చంద్రగిరిలోని ఎన్‌ఆర్‌ఎన్ కేవీకే స్టేడియం, చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, గూడూరు ఏఏఎస్‌ఆర్ స్టేడియం, వెంకటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, శ్రీకాళహస్తి జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్‌టీఆర్ కేవీకే స్టేడియం, సత్యవేడులోని ఎన్‌టీఆర్ కేవీకే స్టేడియం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయి విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 84,488 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,061 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
30న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి పుష్పయాగం
– 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రహ్మోత్సవాల అనంతరం ఆలయ పవిత్రత, లోకక్షేమం కోసం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. 30వ తేదీ ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీటితో విశేష అభిషేకం చేపడతారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువ తదితర సుగంధ పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన అన్ని విభాగాల అధికారులు గ్రీవెన్స్‌కు హాజరుకానున్నట్లు వివరించారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రారంభం.. పవిత్రోత్సవం
తిరుపతి కల్చరల్ : శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్టను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ క్రమంలోనే సోమవారం పవిత్ర సమర్పణ, 28న మహాపూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలను పరిపూర్ణం చేయనున్నారు. ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.


