ఆలయం వద్ద అశేష భక్తజనం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ధర్మరాజులస్వామి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా అగ్నిగుండ మహోత్సవం చేపట్టారు. సుమారు 4వేలమంది భక్తులు కంకణధారులై అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా తొలుత సింహవాహనం అధిష్టించిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అగ్నిగుండం ఎదుట కొలువుదీర్చారు. అనువంశిక పూజారి అగ్నిగుండంలోని నిప్పులను అమ్మవారి ఒడిలో పోసి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం పోతురాజును ధరించిన అనువంశిక పూజారులు మల్లెచెండును నిప్పుల్లో దొర్లించారు. ఈ క్రమంలోనే భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. పవిత్ర ఘట్టం వీక్షించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే, బొజ్జల సుధీర్‌రెడ్డి, ముక్కంటి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు పాల్గొన్నారు. బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ నరసింహామూర్తి పర్యవేక్షించారు. – శ్రీకాళహస్తి
అగ్నిగుండంలోకి ప్రవేశిస్తున్న భక్తులు


