ముందే దూరమైన భర్త అనాథలైన ముగ్గురు పిల్లలు ఉండడానికి ఇల్లు కూడా లేదు కంచనపుత్తూరు ఎస్టీ కాలనీలో తీవ్ర విషాదం
ముక్కుపచ్చలారని ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారని తెలిస్తే ఎవరికై నా గుండె తరుక్కుపోవాల్సిందే. కుటుంబ కలహాలతో ఎనిమిదేళ్ల క్రితం భర్త దూరమైనా ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా పెంచింది. ఆస్తిపాస్తులు.. ఉండడానికి ఇల్లు లేకపోయినా రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేస్తోంది. గ్రామంలో పశువుల కాపరిగా ఉంటూ.. మధ్యమధ్యలో కూలీనాలి చేసి పెద్ద కుమారుడిని ఐటీఐ వరకు చదివించింది. ఇంతలో విధి ఆ కుటుంబంపై పగబట్టింది. పశువులు మేపుతుండగా పాము కాటేయడంతో తల్లి కూడా అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే రెక్కలు విప్పుకుంటున్న ఆ బిడ్డలు ఏ పంచన చేరాలి.. ఎలా బతకాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఎలా బతుకుతారోనని స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. ఈ ఘటన బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కంచనపుత్తూరులో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
బుచ్చినాయుడుకండ్రిగ: పాము కాటుకు గురై పశువుల కాపరి మృతి చెందిన ఘటన కంచనపుత్తూరు గిరిజన కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం.. మండలంలోని కంచనపుత్తూరు గిరిజన కాలనీకి చెందిన మానికల వెంకటరత్నమ్మ (28) పశువుల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని బీడు భూముల వద్ద పశువులు మేపుతుండగా వెంకటరత్నమ్మను పాము కాటు వేసింది. వెంటనే పొలాల నుంచి రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు తెలపగా, ఆస్పత్రికి బయలు దేరేలోపే వెంకటరత్నమ్మ మృతి చెందింది.
ఇల్లు కూడా లేదు
వెంకటరత్నమ్మకు ఇల్లు కూడా లేదు. రేకులతో చిన్నపాటి షెడ్డులాగా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఎండావానలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం తల్లి మృతితో బిడ్డల పోషణతోపాటు.. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేకపోవడంతో ఎలా బతుకుతారో..ఏమోనని స్థానికులు ఆవేదనకు లోనవుతున్నారు. చేతికొచ్చిన ఆడ బిడ్డను ఎవరు చూసుకుంటారోనని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి ముగ్గురు పిల్లల పోషణతోపాటు పెద్ద కుమారుడి ఐటీఐ చదువుకు సహకరించాలని కోరుతున్నారు. అలాగే ఉండడానికి పక్కా ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
పాము కాటుతో పశువుల కాపరి మృతి
ఎలా బతికేదమ్మా!
మానికల వెంకటరత్నమ్మ, చిరంజీవి దంపతులకు ఇద్దరు కుమారులు వెంకటాద్రి, పురుషోత్తమ్, కుమార్తె గౌతమి ఉన్నారు. వెంకటాద్రి ప్రస్తుతం ఐఐటీ చదువుతున్నాడు. మిగిలిన ఇద్దరూ చదువు కు దూరమయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం చిరంజీవి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి మృతి చెందారు. అప్పటి నుంచి వెంకటరత్న మ్మ ముగ్గురు పిల్లలను కూలిపని, పశువుల కాపరి గా ఉంటూ పోషిస్తోంది.ఇప్పుడు తల్లి కూడా దూరమవ్వడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.


