17 లక్షల నుంచి 14 లక్షలకు పడిపోయిన జిల్లా ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

17 లక్షల నుంచి 14 లక్షలకు పడిపోయిన జిల్లా ఓటర్లు

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

● మొత్తంగా 2,87,835 ఓట్లు తగ్గిన వైనం ● 31న ముసాయిదా జాబితా వెల్లడి ● ఈఎఫ్‌లు వెనక్కి ఇవ్వని వారికి నోటీసులు ● తిరుపతిలో 90,882, చంద్రగిరిలో 50,273 ఓట్లు తగ్గుదల

● మొత్తంగా 2,87,835 ఓట్లు తగ్గిన వైనం ● 31న ముసాయిదా జాబితా వెల్లడి ● ఈఎఫ్‌లు వెనక్కి ఇవ్వని వారికి నోటీసులు ● తిరుపతిలో 90,882, చంద్రగిరిలో 50,273 ఓట్లు తగ్గుదల

తగ్గిన ఓట్లు ఇలా..

మృతి చెందిన ఓటర్లు 63,497

డూప్లికేట్‌ ఓటర్లు 66,265

శాశ్వత వలస ఓటర్లు 1,24,798

డబుల్‌ ఎంట్రీలు 31,683

ఇతర ఓటర్లు 1592

మొత్తం తగ్గిన ఓట్లు 2,87,835

తిరుపతి అర్బన్‌: ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ(సర్‌)తో జిల్లా ఓటర్లు భారీగా తగ్గిపోయాయి. దాదాపు 2,87,835 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్‌ ఫారాలు బీఎల్వోలకు ఇవ్వలేదు. వీరంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 17,69,438 మంది ఓటర్లకు సంబంధించి 40 రోజుల పాటు (జూన్‌ 15 నుంచి జూలై 24 వరకు) బీఎల్వోల ఇంటింటా సర్వే నిర్వహించారు. వంద శాతం ఇంటింటా ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఓటర్ల నుంచి 14,81,603 ఫారాలు మాత్రమే తిరిగి వెనక్కి వచ్చాయి. వాటిని ఆన్‌లైన్‌ పద్ధతిలో డిజిటలైజేషన్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,87,835 మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలు తిరిగి వెనుక్కిరాలేదు. ఈ ఓట్లు శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్లు, మృతులు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో 2,87,835 ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం ఈనెల 31 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మరోవైపు మ్యాపింగ్‌ జరగని ఓట్లు 1,62,167, మ్యాపింగ్‌ వివరాలు సక్రమంగా నమోదుకాని ఓటర్లు 70 వేలకు పైగా ఉండడంతో వారందరికీ ఈఆర్‌వోల నుంచి నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుకున్నవారు గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డుతో హాజరుకావాల్సి ఉంది.

అత్యధికంగా తిరుపతిలో తగ్గిన ఓట్లు

సర్‌ నేపథ్యంలో అత్యధికంగా తిరుపతి నియోజకవర్గంలోనే 90,882 ఓట్లు తగ్గిపోగా.. చంద్రగిరిలో 50,273 ఓట్లు.. అత్యల్పంగా కోడూరు నియోజకవర్గంలో 26,048 ఓట్లు తగ్గాయి. మొత్తంగా 14,81,603 మంది మాత్రమే ఎన్యూమరేషన్‌ ఫారాలు బీఎల్వోలకు అందించారు. మ్యాపింగ్‌ కాని ఓట్లు, మ్యాపింగ్‌ అయిన వివరాలు సక్రమంగా లేని ఓట్లు నోటీసుల తర్వాత పరిశీలన అనంతరం ఎన్ని ఓట్లు మిగులుతాయో చూడాల్సి ఉంది.

నియోజకవర్గం గతంలోని ఉన్నట్లు తగ్గిన ఓట్లు

సూళ్లూరుపేట 2,43,284 27,946

వెంకటగిరి 2,45,781 36,505

కోడూరు 2,06,065 26,048

చంద్రగిరి 3,13,795 50,273

తిరుపతి 2,95,288 90,882

శ్రీకాళహస్తి 49,123 32,836

సత్యవేడు 2,16,102 23,345

మొత్తం 17,69,438 2,87,835

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement