తిరుపతి రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కుటుంబం వెంటే తామంతా ఉంటామని, ఆయనపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం తిరుపతి పద్మావతీపురంలోని ఆయన ఇంటికి వెళ్లి భూమన అభినయ్‌రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపిన అనంతరం మోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని టార్గెట్ చేసుకుని సర్కారు వేధింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను, ప్రశ్నించే వారిపై రాజకీయంగా వేధించేందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. భూమన కుటుంబానికి చెందిన పట్టా భూముల్లోకి రెవెన్యూ అధికారులను పంపించి కూల్చివేతలు చేయించడం, బఫర్ జోన్ పేరుతో రివెట్‌మెంట్ వాల్‌ను కూల్చివేయడం పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యేనని ఆయన విమర్శించారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు అనేకం ఉన్నప్పటికీ భూమన కుటుంబ ఆస్తులే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.
స్వర్ణముఖి నది బఫర్ జోన్ ఆక్రమించి గోడలు కట్టడం చట్ట విరుద్ధమే అయితే హెరిటేజ్ ఫ్యాక్టరీ కూడా స్వర్ణముఖి నదికి ఆనుకునే ఉంది కదా? కూల్చివేతలు దాని నుంచే మొదలు పెడదామా? అని మోహిత్‌రెడ్డి ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే లక్ష్యమా?
చంద్రబాబు ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్న భూమన కుటుంబం చంద్రబాబుకు కంటిలో నలుసులా మారిందని, అందుకే ఆ కుటుంబంపై పగబట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మోహిత్‌రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేసే ఉడత ఊపులకు, బెదిరింపులకు భూమన కుటుంబం భయపడదని, ఆ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, బాబు సర్కారు రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


