సూళ్లూరుపేట: పట్టణ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠాను శుక్రవారం అరెస్ట్ చేసి వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే 96 గ్రాములు బరువు కలిగిన నాలుగు బంగారు చైన్లుతో పాటు ఒక కేటీఎం డ్యూక్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. సూళ్లూరుపేట సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చైన్నెలోని కొరుక్కుపేటకు చెందిన కే.మోసెస్ (33), మరియాదాస్ ఆనంద్ (20) తమిళనాడు దొంగలు ఈ ప్రాంతానికి మోటార్ సైకిల్‌పై వచ్చి అక్కడక్కడా చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని పార్కువీధిలో ఓ మహిళ మెడలో చైన్ లాక్కుని ఉడాయించిన ఘటనలో సీసీ కెమెరాల్లో చూసి నిందితులను గుర్తించామని తెలిపారు. అప్పటి నుంచి వీరిద్దరిపై నిఘా పెట్టి శుక్రవారం అరెస్ట్ చేసి విచారించగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిపై తమిళనాడులో 15 కేసులు, దొరవారిసత్రం, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో ఐదు కేసులున్నాయని తెలిపారు. అలాగే మరియాదాస్ ఆనంద్‌పై తమిళనాడులో 12 కేసులు, సూళ్లూరుపేట ఐదు కేసులున్నాయని పేర్కొన్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ అజయ్‌కుమార్‌తో పాటు సిబ్బంది ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ మేరకు వారికి క్యాష్ రివార్డులను అందజేశారు.


