తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఓ పేషెంట్‌కు అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఎర్రావారిపాళెంకు చెందిన సిద్ధరాజు (48)కి టీటీడీ ప్రాణదానం పథకం ద్వారా గుండె శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వనజాక్షమ్మ మాట్లాడుతూ గుండె వైఫల్యంతో మూడు నెలలుగా బాధపడుతున్న రోగి సిద్ధరాజు మందులతో చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మేరకు మెరుగుదల కనిపించలేదన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ డిఫిబ్రిలేటర్ పరికరాన్ని అమర్చాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ణయించారని తెలిపారు. కార్డియాలజీ విభాగాన్ని సంప్రదించగా, వైద్యుల ప్రత్యేక కృషితో ప్రాణదానం పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరైందన్నారు. దీంతో ఈనెల 18వ తేదీన విజయవంతంగా కార్డియాక్ రీసింక్రోనైజేషన్ థెరపీ– డిఫిబ్రిలేటర్ ిపరికరాన్ని అమర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోగి బంధువులు టీటీడీకి, స్వీమ్స్ వైద్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.


