ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారనే భూమనపై కక్ష సాధింపులు అధికార యంత్రాంగాన్ని ఈ విధంగా వాడుకోవడం సిగ్గుచేటు హెరిటేజ్ సంస్థ ఆక్రమణలపై ఇలాగే స్పందిస్తారా? కూటమి అరాచకాలపై కళత్తూరు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులనే టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించడం, జైళ్లకు పంపడం, దాడులు చేయడం వంటి అరాచకాలు సృష్టిస్తున్నారని, రాజకీయ కక్షతోనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కుటుంబ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి నారాయణస్వామి మీడియా తో మాట్లాడారు. రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీలేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి అవినీతి అక్రమాలతో రెడ్‌బుక్ పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఎండగడుతూ పోరాటాలు చేస్తున్నారని గుర్తుచేశారు. దాంతో పాటు టీటీడీలో జరుగుతున్న అపచారాలపైన నిత్యం ప్రశ్నిస్తున్నారన్న అక్కసు, కక్షతో భూమన గొంతు నొక్కేయాలన్న దురాలోచనతో వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. 24 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన పంట పొలాలు ఇప్పుడు ఆక్రమణ ఎలా అయ్యాయని ప్రశ్నించారు. స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న రైతులంతా ప్రహారీలు నిర్మించుకున్నారని తెలిపారు. వారంతా ఆక్రమణలకు పాల్పడినట్లేనా? అని ప్రశ్నించారు.
బఫర్ జోన్‌లోనే ప్లాంట్ నిర్మాణం
చంద్రగిరి మండలం, కాశిపెంట్ల వద్ద ఉన్న హెరిటేజ్ సంస్థ వ్యర్థ జలాల ప్లాంట్ ఏకంగా స్వర్ణముఖి నది బఫర్ జోన్‌లోనే నిర్మించడం ఆక్రమణ కాదా ? అని నారాయణస్వామి ప్రశ్నించారు. చట్టం ఏమీ చంద్రబాబు చుట్టం కాదని మండిపడ్డారు. అనంతరం వైస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాజకీయ కక్ష తప్ప ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోరన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక తీరును ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడమే ఆయన నైజమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిత్యం ఎండగడుతున్న భూమన గొంతుకను నొక్కేసేందుకే ఆయన ఆస్తులను ధ్వంసం చేయిస్తున్నారని మండిపడ్డారు. విలువతో కూడిన రాజకీయం చేసే భూమన కరుణాకరరెడ్డి ఆస్తులే కాదు.. ఆయన ప్రాణాలు పోయినా చంద్రబాబు బెదిరింపులకు భయపడరని స్పష్ట చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల కోసం తామంతా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలబడుతామని హెచ్చరించారు. అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు ఈ విధంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీసెల్ అధ్యక్షుడు కోటూరు ఆంజనేయులు, పార్టీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు చేజర్ల మురళి పాల్గొన్నారు.
మా ఆస్తులే కాదు.. మా ఇల్లు కూల్చేసినా భయపడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టకుండా ఉంటాం.. అని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోసం మా ఆస్తులు, ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా ఆయన వెన్నంటే ఉండి పోరాడుతామని పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు భూమన అభినయ్‌రెడ్డిని కలిసి వారి ఆస్తుల విధ్వంసంపై చర్చించారు. కేవలం భూమన కుటుంబాన్ని భయపెట్టి భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి గొంతు నొక్కేందుకే చంద్రబాబు ఆడుతున్న కపట నాటకం ఇది ఒక భాగమన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేయడమే భూమన కరుణాకరరెడ్డికి తెలుసన్నారు. ఇప్పటివరకు చూసింది కొంతేనని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను చేపడుతామని హెచ్చరించారు.


